US Visa: వీసాదారుల నెత్తిన ట్రంప్ మరోబాంబ్.. ష్యూరిటీ కింద 15 వేల డాలర్లు కట్టాల్సిందే..!

బిజినెస్, టూరిస్టు వీసాలపై అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..! అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. బిజినెస్, టూరిస్ట్ వీసా (US Visa) కోసం దరఖాస్తు చేసుకునేవారు షూరిటీ కింద 15వేల డాలర్ల వరకు బాండ్ (Bond for Visa) చెల్లించాలని అగ్రరాజ్య విదేశాంగశాఖ ప్రతిపాదనలు చేసింది. ఈమేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో నోటీసులు పబ్లిష్ చేయనుంది.
12 నెలల పైలట్ ప్రోగ్రామ్ కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్) వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నారు. ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారి నోటీసు పెట్టిన 15 రోజుల్లోపు ఈ పైలట్ ప్రోగ్రామ్ అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. బిజినెస్, పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం 5వేలు, 10వేలు, లేదా 15వేల సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని.. గడువు పూర్తయిన తర్వాత దేశం వీడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలాకాకుండా.. చట్టవిరుద్ధంగా వ్యవహరించినా.. వీసా గడువు ముగిశాక కూడా అగ్రరాజ్యంలోనే ఉన్నా.. ఎలాంటి రీఫండ్ దక్కదు.
అయితే, ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదట. షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా (USA) విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. 90 రోజుల బిజినెస్, పర్యాటక ప్రయాణాల కోసం తీసుకొచ్చిన వీసా వేవర్ ప్రోగ్రామ్‌లో ఉన్న దేశాలకు ఈ బాండ్ వర్తించబోదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 42 దేశాలు ఉన్నాయి. అందులో మెజార్టీ యూరోప్ దేశాలు కాగా.. ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి. అంతేకాదు.. వీసా దరఖాస్తుదారు ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కూడా ఒక్కోసారి బాండ్ల నుంచి మినహాయింపు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
వీసా గడువు తీరినా కొంతమంది దేశం విడిచి వెళ్లడం లేదని, వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. గతంలో ట్రంప్ (Donald Trump) తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ తరహా పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. 2020 నవంబరులో వీసాలకు బాండ్ల నిబంధనను ప్రకటించారు. అయితే, కొవిడ్ మహమ్మారి కారణంగా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమలుకాలేదు.