Usha Vance : ప్రధాని మోదీతో భేటీ ఎంతో ప్రత్యేకం … భారత పర్యటనపై ఉషా వాన్స్

భారత్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ ఎంతో ప్రత్యేకమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) అన్నారు. అమెరికా-భారత్‌ల దౌత్య సంబంధాలు తనకు ఎంతో వ్యక్తిగతమైన అంశాలని తెలిపారు. వాషింగ్టన్ డీసీ (Washington DC ) లో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం లో ఉషా వాన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తమ భారత పర్యటన (India tour) ను ఆమె గుర్తు చేసుకున్నారు. ఇది మాకు జీవితకాలం గుర్తుండిపోయే ప్రయాణం. నా పిల్లలు భారత్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకునేవారు తప్ప ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదు. ఇప్పుడు వారు స్వయంగా భారత్‌లో పర్యటించి, అనేక విషయాలను తెలుసుకోగలిగారు. నాకు, జేడీకి కూడా ఇది ఎంతో ప్రత్యేకమైనది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన (America tour) కు వచ్చినప్పుడు తొలిసారిగా పిల్లలు ఆయన్ని కలిశారు. అప్పుడే వారు ప్రధాని మోదీని తాతగా భావించారు. మేం తిరిగి ఢల్లీి పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని నివాసానికి వెళ్లగానే పిల్లలు ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. వారికి ఆయనంటే ఎంతో ఇష్టం అని ఉషా తెలిపారు.