India :అతి త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం : మంత్రి లుట్నిక్

భారత్ తమకు సారీ చెప్పి వాణిజ్య ఒప్పందానికి అర్రులు చాస్తుందని అమెరికా దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) జోస్యం చెప్పారు. నా ఉద్దేశం ప్రకారం నెల, రెండు నెలల్లో భారతదేశం (India) మాతో వాణిజ్య చర్చలకు కూర్చుని క్షమాపణ చెబుతుంది, ట్రంప్ (Trump) తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. రష్యా (Russia) నుంచి చమురు కొనడం ఆపేయాలని, బ్రిక్స్‌లో భాగం కాకూడదని, అమెరికాకు, ఆ దేశ కరెన్సీ డాలర్‌కు మద్దతు తెలపాలని, లేదా 50 శాతం సుంకాలను ఎదుర్కోవాలని రంకెలు వేశారు. చైనా, ఇండియా పరస్పరం తమ ఉత్పత్తులను అమ్ముకోలేవని, రెండు దేశాలూ తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అమెరికాకు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. భారతదేశం గనక బ్రిక్స్ దేశాల నడుమ అచ్చు లాగా (బ్రిక్స్ అనే ఆంగ్ల పదంలో ఇండియాను సూచించే ఐ అనే అక్షరం సరిగ్గా మధ్యలో ఉంటుంది. దానికి ఎడమ పక్కన ఆర్ (రష్యా), కుడిపక్కన సి (చైనా), అనే అక్షరాలు ఉంటాయి. అంటే రష్యా, చైనా దేశాలకు వారధిలాగా) ఉండాలనుకుంటే అలాగే ఉండొచ్చని, అదెంతకాలం కొనసాగుతుందో తామూ చూస్తామని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు.