Donald Trump :ఆ నిర్బంధ కేంద్రాన్ని మూసేయండి .. ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టులో చుక్కెదురు

ఓ నిర్బంధ కేంద్రానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైంది. ఫ్లోరిడా (Florida)లోని నిర్బంధ కేంద్రంలోకి కొత్తగా వలసదారులెవరినీ తరలించొద్దని ఫెడరల్ కోర్టు (Federal Court ) ఆదేశించింది. ఆ కేంద్రంలోని చాలా భాగాన్ని కూల్చివేసి, పూర్తిస్థాయిలో దానిని మూసివేయాలని స్పష్టం చేసింది. ఇక్కడ తాత్కాలికంగా నిర్మించిన ఫెన్సింగ్, జనరేటర్లు, చెత్త, మురుగు నిర్వహణ వ్యవస్థలను 60 రోజుల్లోగా తొలగించాలని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలపై స్పందించిన ఫ్లోరిడా ప్రభుత్వం అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌లో నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 3 వేల మందిని బంధించేందుకు వీలుగా టెంట్లు, వైరు బోనులు, బెడ్‌లు ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాన్ని ఇటీవల తనిఖీ చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రాంతంలో ఉండే ప్రాణాంతక జీవాలు కాపలాదారుగా పని చేస్తాయంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అందుకే ఈ కేంద్రానికి ఎలిగేటర్ అల్కట్రాజ్(Alligator Alcatraz) అని శ్వేతసౌధం పేరు పెట్టడం గమనార్హం.