ఒకేసారి నాలుగు చారిత్రక సంక్షోభాలు : జో బైడెన్
అమెరికా ఏకకాలంలో నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని ఇటీవీ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కాలానుగుణ సవాళ్లను ఎదుర్కోవడంపై తన బృందం హార్డ్ వర్క్ చేస్తున్నదని ఆయన చెప్పారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ట్విట్టర్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా కొవిడ్-19 విజృంభణ, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పు, జాతివివక్ష లాంటి నాలుగు చారిత్రక సంక్షోభాలను ఒకేసారి ఎదుర్కొంటున్నదని బైడెన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ నాలుగు సంక్షోభాల నుంచి దేశాన్ని బయట పడేయడానికి జనవరిలో అధికార బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే తాను, తన బృందం చర్యలు తీసుకుంటామని, ఒక్కరోజును కూడా వృథా చేయబోమని చెప్పారు.






