Donald Trump: అక్రమ వలసదారులకు షాక్.. జన్మతః పౌరసత్వంపై వేటు..

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే ట్రంప్(Trump).. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. ఇందులో అత్యంత కీలకమైంది.. జన్మతః పౌరసత్వ విధానాన్నిరద్దు చేశారు. దాదాపుగా వందేళ్లకు పైగా అనుసరిస్తున్న ఈ విధానానికి ప్రస్తుతంప్రభుత్వం స్వస్తి పలికింది. దీంతో వారందరినీ స్వదేశాలకు పంపిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు నిజమవుతాయని సూచనలు వస్తున్నాయి. సహజంగానే ఈపరిణామం.. ఆయా కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోంది.
వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. తాజాగా దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ‘‘అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం(fedaral government) గుర్తించదు’’ అని ట్రంప్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన ప్రభుత్వం వలస విధానంపై తీసుకొనే చర్యలకు ఇది చిహ్నమని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధానం దాదాపు శతాబ్దకాలంగా అమలులో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. కాగా, ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విధానం ఒక్క అమెరికానే కాదు.. ప్రపంచంలో దాదాపుగా 30 దేశాలు ఈవిధానాన్ని అవలంభిస్తున్నాయి.అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది.
అయితే ఇప్పటికే లక్షలాది మంది ఇలా అక్రమంగా , వివిధ పద్దతుల ద్వారా అమెరికాలో చేరడమే కాదు.. అక్కడి సమాజంతో కలిసిపోయారు. ఇప్పుడు వారిని ఇలా ఒక్క కలం పోటుతో వెనక్కుపంపిస్తామని ట్రంప్ చెబుతున్నారు.ఇది న్యాయపరంగానే కాదు.. సమాజపరంగానూ ఇబ్బందులు తెచ్చే అవకాశముందని తెలుస్తోంది.