Washington: ట్రంప్ పట్టాభిషేకానికి వేళాయె..

అగ్రరాజ్యం అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారానికి అత్యంత అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం 78 ఏళ్ల ట్రంప్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 82ఏళ్ల జో బైడెన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్‌లోని(capital hill) రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి వేల మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ చేరుకున్నారు. అయితే ఇండోర్ ఆవరణలో ప్రమాణం కారణంగా గతంలోలా వేల మంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేరు. వారంతా ఎక్కడికక్కడ సంబరాల్లో పాల్గొంటారు. అత్యంత ప్రముఖులు మాత్రం హాజరవుతారు.
3 రోజుల సంబరాలు
ట్రంప్ ప్రమాణ స్వీకార సంబరాలు శనివారమే ప్రారంభమయ్యాయి. ఫ్లోరిడా నుంచి వర్జీనియా(virginia)లోని స్టెర్లింగ్‌లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు చేరుకున్న ఆయన సాయంత్రం విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చారు. అదే సమయంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్ వాషింగ్టన్‌లో క్యాబినెట్ సహచరులతో విందులో పాల్గొన్నారు.
ఇవాళ ట్రంప్.. ఆర్లింగ్టన్ జాతీయ స్మారకంవద్ద జరిగే కార్యక్రమం, ఆ తర్వాత వాషింగ్టన్‌లోని క్యాపిటల్ వన్ ఎరీనా వద్ద ర్యాలీకి హాజరవుతున్నారు. ఆ తర్వాత ప్రైవేటు డిన్నర్‌లో సైతం పాల్గొంటారు. ప్రమాణ స్వీకారం జరిగే సోమవారంనాడు సెయింట్ జాన్స్(saint johns) ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి శ్వేతసౌధానికి వెళ్లి దిగిపోతున్న అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్ హిల్‌కు వస్తారు. అక్కడ ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రారంభోపన్యాసమిస్తారు. ఆ తర్వాత బైడెన్, కమలా హారిస్‌లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్స్, టెస్లాల అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, టిక్‌టాక్ సీఈవో షౌ జీ చ్యూ హాజరవుతారు. ప్రమాణం చేశాక కొన్ని ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేస్తారు. కాంగ్రెస్‌లో జరిగే విందులో పాల్గొంటారు. ఆ తర్వాత సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన ఆయన మద్దతుదారులు హాజరుకానున్నారు. ఈ మేరకు వారు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారని తెలుస్తోంది.