Donald Trump: ట్రంప్ ఆట మొదలు.. పుతిన్ కు తొలిరోజే షాక్..

అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్.. అప్పుడే ఆట మొదలుపెట్టేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని(Russia-ukraine war) ఆపేస్తానని ప్రచార సమయంలో చెప్పిన ట్రంప్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆదిశగా దృష్టి సారించారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య సమన్వయానికి అధికారులు, ప్రతినిధులను నియమించిన ట్రంప్.. ఇప్పుడు పదవి స్వీకరించగానే.. నేరుగానే కామెంట్ చేశారు.
పుతిన్ యుద్ధవిరమణ ఒప్పందం చేసుకోవాలి. కానీ ఆయన సంధికుదుర్చుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నాడని అనుకొంటున్నాను. రష్యా పెద్ద చిక్కుల్లో పడనుంది’’ అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. అంతేకాదు తనను కలవాలని పుతిన్ అనుకుంటున్నారని.. అందుకే , పుతిన్‌తో భేటీకి ఏర్పాట్లుచేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ‘‘నేను ఆయన్ను కలవనున్నాను. ఉక్రెయిన్‌తో సంధిని ఆయన కోరుకుంటున్నారని ఆశిస్తున్నాను. కాకపోతే ఆయన సరిగ్గా చేయడంలేదు. అక్కడ సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతోంది. తొలుత అది వారం రోజుల్లోనే ముగుస్తుందనుకొన్నారు. కానీ, ఇప్పటికి మూడేళ్లయింది. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలతో రష్యా ఆర్థికవ్యవస్థ బాగా దెబ్బతింది. మరోవైపు జెలెన్‌స్కీ కూడా శాంతిని కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు ట్రంప్.
డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు భేటీ అవనున్నారని తరచూ వస్తున్న వార్తలపై కొన్నాళ్లక్రితం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ స్పందించింది. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం ఆయనతో చర్చల్లో పాల్గొంటారని తెలిపింది. అయితే పుతిన్‌తో చర్చల కోసం యూఎస్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదంది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పటికే ట్రంప్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు అంతర్జాతీయ రక్షణరంగనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు… యుద్ధాన్ని విస్తరించొద్దని పుతిన్‌కు ట్రంప్ సూచించినట్లు సమాచారం..
అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన వేళ పుతిన్ సత్వరం స్పందించారు. ఈ చర్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు. ఆయన ప్రాణాలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య సాన్నిహిత్యం మరోసారి ప్రపంచానికి వెల్లడైంది.