ఆదిమతెగ మహిళకు అరుదైన గుర్తింపు…
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన క్యాబినెట్లోకి అమెరికా ఆదిమ తెగకు చెందిన మహిళకు అరుదైన స్థానం కల్పించారు. ఇంటీరియర్ డిపార్ట్ మెంట్ కు లగునా ప్యుబెలో తెగకు చెందిన డెబ్ హాల్యాండ్ను మంత్రిగా ప్రకటించారు. నేటివ్ అమెరికన్లుగా పిలువబడే స్థానిక ఆదిమ జాతి తెగలకు చెందిన వ్యక్తులకు క్యాబినెట్లో స్థానం దక్కడం ఇదే తొలిసారి. డెబ్ హాల్యాండ్ది న్యూ మెక్సికో రాష్ట్రం. అమెరికా ఇంటీరియల్ డిపార్ట్ మెంట్ సుమారు 70 వేల ఉద్యోగులు ఉన్నారు. జాతీయ వనరులకు సంబంధించిన అన్ని అంశాలను ఈ శాఖ చూసుకుంటుంది. జాతీయ పార్క్ లు, ఆయిల్ -గ్యాస్ డ్రిల్లింగ్ సైట్లు, గిరిజన భూములు ఇంటీరియల్ డిపార్ట్ మెంట్ పరిధిలోకి వస్తాయి. దేశంలోని గిరిజన తెగల ప్రజలకు సేవలు అందించడం కోసం గతంలో హాల్యాండ్ అనేక పోరాటాలు చేశారు. కరోనా మహమ్మారి వేళ గిరిజనుల కోసం ఆమె ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. బైడెన్-హారిస్ టీమ్‌లో సభ్యురాలు కావడం గౌరవంగా భావిస్తున్నానని, గిరిజనులను ట్రంప్ సర్కార్ పట్టించుకోలేదని, ఇప్పుడు ఆ లోటును తీర్చే ప్రయత్నం చేయనున్నట్లు హాల్యాండ్ వెల్లడించారు.






