J.D. Vance:అవసరమైతే అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం : జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ అనుకోని ఘోరమైన విషాదం జరిగితే దేశ అధ్యక్షుడి (President) బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) (79) ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు. ఆయన తన పూర్తి పదవీ కాలం బాధ్యతలు నిర్వర్తిస్తారని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను వాన్స్ కొట్టి పారేశారు. అయితే ప్రస్తుతం తానున్న పదవి రీత్యా అనుకోనిది జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సన్నద్ధం అయినట్లు తెలిపారు. కాగా, తన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ (Make America Great Again ) (మాగా) ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లగలవారిలో వాన్సే ముందుంటారని, ట్రంప్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్ అభ్యర్థిత్వంపై ఆశలు రేపారు.