Donald Trump: భారత్ పై ట్రంప్ కోపం అదేనా..? ఎందుకీ స్వార్ధం..?

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచ దేశాలకు ఏదోక రూపంలో షాక్ ఇస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం భారత్ కు షాక్ ఇచ్చారు. ఆగస్ట్ 1 నుంచి భారత్ పై 25 శాతం సుంకాలు(Tarrif) విధించారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని రష్యా నుండి చమురు, సైనిక పరికరాలను కొనుగోలు చేస్తున్న భారత్.. అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. గత వారం రోజుల నుంచి దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.
ఉక్రెయిన్ కు మద్దతుగా మాట్లాడుతున్న ట్రంప్.. రష్యాకు అనుకూలంగా ఉండే దేశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ విషయంలో ట్రంప్ సర్కార్ కోపం ఇదే అనేది అంతర్జాతీయ పరిశీలకుల మాట. భారత్ – అమెరికా మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య వ్యాపారం తక్కువే జరిగింది అన్నారు. “గుర్తుంచుకోండి, భారత్ మనకు మిత్రదేశంగా ఉన్నప్పటికీ, వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు ట్రంప్. ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయని కామెంట్ చేసారు.
అలాగే భారత్ ఏ దేశంలోనూ లేనంత కఠినమైన, అసహ్యకరమైన ద్రవ్యేతర వాణిజ్య షరతులు విధించారు. అందుకే తక్కువ వ్యాపారం చేస్తున్నామన్నారు ట్రంప్. అలాగే, వారు ఎల్లప్పుడూ తమ సైనిక పరికరాలలో ఎక్కువ భాగాన్ని రష్యా నుండే కొనుగోలు చేసేవారని అసహనం వ్యక్తం చేసారు. రష్యా ఉక్రెయిన్‌లో హత్యలను ఆపాలని అందరూ కోరుకుంటున్న సమయంలో, చైనాతో తర్వాత రష్యా నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్ళు చేస్తున్న దేశం భారత్ అని అసహనం వ్యక్తం చేసారు. అది మంచిది కాదన్నారు ట్రంప్.
అందుకే ఆగస్టు నుండి 25% సుంకం, పైన పేర్కొన్న వాటికి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత వారం, అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం, ట్రంప్ రష్యా నుండి చమురు కొనుగోలు కొనసాగించే దేశాలపై కఠినమైన సుంకాలను విధిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ దేశాలు చౌకైన రష్యన్ చమురులో దాదాపు 80 శాతం కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు.