Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?

ఎన్నోయుద్ధాలు ఆపా.. ఎంతో రక్తపాతాన్ని, లక్షల ప్రాణాలను నిలబెట్టా.. అందుకే నాకు, నోబెల్ శాంతి బహుమతి రావాలి. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ ను.. నేనే నిలువరించా..నేను ఫోన్ చేస్తేనే.. ఆ ఆపరేషన్ నిలిచిపోయింది. ఉక్రెయిన్, రష్యా వార్ సైతం ఆపడానికి ప్రయత్నిస్తున్నా.. నాకు నోబెల్ శాంతి బహుమతి రావాల్సిందే.. ఇదీ ట్రంప్ (Trump) భావన. దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే ట్రంప్ కు చటుక్కున ఆగ్రహం వచ్చేస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో భారత్ పై ఆంక్షలేశారని కొందరు అభిప్రాయపడ్డారు కూడా.
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా ఆరాటపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు యుద్ధాలను ఆపిన తను కచ్చితంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని విశ్వసిస్తున్నారు. శాంతి స్థాపన కోసం తను చేసిన కృషి గురించి ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. అయితే, నోబెల్ ప్రైజ్ కోసం ఇంతగా ఆరాట పడటం చివరకు వికటించే అవకాశం ఉందని నోబెల్ కమిటీ కూడా ఇటీవల అభిప్రాయపడింది. ట్రంప్ పేరెత్తకుండా ఈ హెచ్చరికలు చేసింది (Trump Nobel Peace Prize 2025).
నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆశ్లే టోయే స్పందించారు. ‘కొందరు నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. మా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు తీవ్రంగా లాబీయింగ్ చేస్తుంటారు. కానీ మేము నాలుగు గోడల మధ్య బయటి ప్రభావాలు లేకుండా పనిచేసేందుకు ప్రయత్నిస్తుంటాము. అసలు మా మధ్య ఏకాభిప్రాయం కుదరడమే చాలా కష్టం’ అని స్పష్టం చేశారు (peace prize speculation Trump).
ఇటీవల ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మాట్లాడుతూ తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ‘నేను ఏడు యుద్ధాలను ఆపాను. ఆయా దేశాధినేతలతో నేను స్వయంగా మాట్లాడాను. రోజంతా శ్రమించాను. ఐక్యరాజ్య సమితి నుంచి నాకు ఎలాంటి సాయం అందలేదు. పని చేయని ఎస్కలేటర్, టెలీప్రాంమ్టర్ మాత్రమే యూఎన్ నుంచి నాకు వచ్చాయి’ అని ట్రంప్ అన్నారు.
ఇక డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి వచ్చే అవకాశమే లేదని చరిత్రకారుడు ఆస్లే స్వీన్ అన్నారు. గాజా యుద్ధంలో ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారని, రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తున్న సమయంలో పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరించారని గుర్తు చేశారు. దీంతో, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదని అన్నారు. ‘ట్రంప్ కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా తప్పుకుంది. పారిస్ ఒప్పందం నుంచి కూడా వైదొలగింది. ఇలాంటి వాళ్లకు నోబెల్ ప్రైజ్ రావాలని ఎవరూ కోరుకోరు కదా’ అని ఓస్లాలోని పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నీనా గ్రేగర్ పేర్కొన్నారు.