Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..

కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మందిప్రాణాలు కోల్పోవడానికి ప్రధానకారణం.. విజయ్ (Vijay) ఆలస్యమే.. ఇదీ తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్. విజయ్ ఉద్దేశపూర్వక రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.‘‘విజయ్ (TVK chief Vijay) ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. 11 గంటలకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. మధ్యాహ్నం ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంది. కానీ ఆయన సాయంత్రం ఏడు గంటలకు వచ్చారు. భారీ జనసందోహాన్ని చూపించేందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన ఆలస్యంగా వచ్చారు. దానివల్ల ప్రజలు అలా ఎండలో నిల్చొని అలసిపోయారు. విజయ్ వస్తోన్న బస్ షెడ్యూల్‌కు భిన్నంగా పలుచోట్ల ఆగింది. వాటికి ఎలాంటి అనుమతి లేదు. అది అలా ఆగడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
అక్కడ గుమిగూడిన వారికి ఆహారం, మంచినీళ్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేవంటూ వచ్చిన హెచ్చరికలను నటుడితో పాటు సీనియర్ నాయకుడు ఎన్ ఆనంద్ విస్మరించారు. ఇక ఏడు గంటలకు విజయ్ వచ్చే సరికి ఆ జనసమూహాన్ని నిర్వహించడం కష్టమైపోయింది. అది తొక్కిసలాటకు దారితీసింది’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీ జిల్లా సెక్రటరీ మథియాళన్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆనంద్, స్టేట్ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
ఈ తొక్కిసలాటకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారని సమాచారం. తప్పుడు సమాచారవ్యాప్తి వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకే ఆ పరిశీలన అని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో కుట్రకోణం ఉందని, స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ టీవీకే మద్రాస్ హైకోర్టు (Madras High Court)ను ఆశ్రయించింది.