POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!

పాకిస్తాన్ (Pakistan) కు ఓవైపు బలూచిస్తాన్ చమటలు పట్టిస్తోంది. అక్కడి లిబరేషన్ ఫ్రంట్ అయితే..నేరుగా పాకిస్తాన్ సైన్యానికి నేరుగా సవాల్ విసురుతోంది. ఇప్పుడక్కడకు వెళ్లాలంటేనే పాక్ ఆర్మీకి గుండె దడదడ లాడుతోందని చెప్పొచ్చు. ఈసమస్య నుంచి బయటపడడమెలాగో తెలియక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తలపట్టుకుంటున్నారు. పాక్ ఆర్మీ, రాజకీయనేతలు, అధికారులు … దీనికి సరైన పరిష్కారం వెతకలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీరం రగలడం.. పాక్ కు కొత్త తలనొప్పులు తెచ్చుపెడుతోంది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవారం వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రధాని షరీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీలు చేపట్టారు. ముజఫరాబాద్, రావల్‌కోట్‌తోపాటు పలు ప్రాంతాల్లో స్కూళ్లు, షాపులు, ఇతర వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు పూనుకున్నారు.
వీలైనంత త్వరగా నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలని షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ టారీఫ్‌లు తగ్గించాలని, నిత్యావసర వస్తువులపై సబ్సీడీ ఇవ్వాలని అడుగుతున్నారు. కాశ్మీర్ శరణార్థులకు కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను కూడా తీసేయాలని పట్టుబడుతున్నారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్నికల హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, నిరసనల నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. పరిస్థితులు చెయ్యి దాటి పోకుండా ఉండటానికి చర్యలు మొదలెట్టింది.