DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!

తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ఘటన చుట్టూ అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. దీనిలో కుట్రకోణం ఉందని.. విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ నిలిచిపోయిందని.. టీవీకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అభిమానులు ఆయన్ను చూసేందుకు ముందుకుకదిలారని.. ఈక్రమంలోనే తొక్కిసలాట (Karur stampede) జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొక్కిసలాటకు ముందు కొంతసేపు కరెంటు సరఫరా నిలిచిపోయినట్లు పలువురు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు..
తొక్కిసలాట ఘటనకు సంబంధించి కుట్ర కోణం ఉందని, విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని చేసిన ఆరోపణలపై తమిళనాడు విద్యుత్తు బోర్డు (Tamil Nadu Electricity Board) స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతిపత్రం ఇచ్చిందని ఆ రాష్ట్ర విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. అయితే అందుకు తాము అంగీకరించలేదని తెలిపారు.
సెప్టెంబర్ 27, 2025 రాత్రి ఈ రోడ్డులోని వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ.. టీవీకే నుండి లేఖ అందిందని విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అందులో ప్రజల భద్రతను దృష్టిలోఉంచుకొని.. విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని (Power Cut) కోరారన్నారు. కానీ ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ.. తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని తెలిపింది. ఆ పార్టీ ఏర్పాటుచేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. అయితే ఘటన అనంతరం టీవీకే మాత్రం దీనిలో కుట్ర కోణం ఉందని ఆరోపించింది. తమ నేత విజయ్ ర్యాలీ వేదికకు చేరుకున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారని పేర్కొంది.