Bathukamma: దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో అలరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే మనుమరాలు

దుబాయ్‌లో ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ (Bathukamma) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షులు సి.ఎన్. రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె. అరుణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక ప్రదర్శనల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి మనవరాలు, డాక్టర్ పైడి సుచరిత రెడ్డి కుమార్తె అయిన ఎనిమిదేళ్ల చిన్నారి జయ రెడ్డి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. జయ ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ అద్భుత ప్రదర్శనకు మెచ్చి నిర్వాహకులు (IPF) చిన్నారిని అభినందించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా జయ తల్లి డాక్టర్ సుచరిత రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి వేదికపై తన కుమార్తె ప్రదర్శన చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం అంతా జయ గురువు డాక్టర్ నవ్య నందిని శిక్షణ, ప్రోత్సాహంతోనే సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకలు తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో కూడా సగర్వంగా ప్రదర్శించాయి.