US-India: అమెరికా-ఇండియా మధ్య దూరం మరింత పెరిగిందా..?

అమెరికా-పాక్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుండడం.. అదే సమయంలో భారత్ పై ట్రంప్ (Trump) టారిఫ్ వార్ వెరసి.. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య దూరం పెరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదే పదే ట్రంప్ కార్యవర్గం భారత్ పై ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో ఢిల్లీ ఎలా ప్రవర్తించాలో వారే చెబుతూ వస్తున్నారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య దూరం మరింతగా పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి సైతం అదే స్థాయిలో .. అమెరికాకు కౌంటర్లు పడుతున్నాయి. ఢల్లీిలో జరిగిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరం’ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు జైశంకర్. ఆ రెండు దేశాలకూ ఓ చరిత్ర ఉందని, గతాన్ని విస్మరించిన చరిత్ర కూడా వారిదేనన్నారు. ఈ సందర్భంగా ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన ఘటనను ఉటంకిస్తూ.. అమెరికా సైన్యం అబోటాబాద్‌లో జరిపిన ఆపరేషన్‌ను గుర్తుచేశారు. ‘‘ఆ రెండు దేశాలకు పరస్పర చరిత్ర ఉంది.
అంతేకాదు.. గతాన్ని విస్మరించిన చరిత్ర కూడా వారిదే. ఇటువంటివి మనం చూడటం కొత్తమీ కాదు. ఇదే అమెరికా సైన్యం అబోటాబాద్ (పాకిస్థాన్‌లోని) వెళ్లి ఎవర్ని గుర్తించిందో మనందరికీ తెలుసు’’ అని జైశంకర్ పేర్కొన్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబర్ 11నాటి దాడికి సూత్రధారి బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్ని దేశాలు అవకాశవాద రాజకీయాలపై దృష్టి పెట్టినప్పుడు.. అవి అలా చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని వ్యూహాత్మకంగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉండవచ్చు’’ అని అన్నారు. ఇలాంటివి చూస్తున్నప్పుడు అమెరికాతో మనకు ఉన్న బలమైన సంబంధాలు ఏంటీ? ఏవి ముఖ్యమైనవనే అంశాలపైనా భారత్ దృష్టి సారిస్తుందన్నారు.
మరోవైపు అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము చెత్త పనులన్నీ చేస్తున్నామని అన్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డామని, చివరకు అది పొరబాటు అని అర్థమైందన్నారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యాధికారి ఇటీవల రెండుసార్లు వాషింగ్టన్‌లో పర్యటించడం, తదనంతరం ట్రంప్ యంత్రాంగం పాక్‌పై సానుకూల ధోరణి అవలంబించడం ఆ రెండు దేశాల సాన్నిహిత్యాన్ని స్పష్టం చేస్తోంది.