Trump: రష్యా-ఉక్రెయిన్ పోరుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ట్రంప్ ట్రేడ్ వార్.. గతంలో వార్ అంటే యుద్ధమే అని అనుకునే పరిస్థితి ఉండేది. ప్రత్యర్థి దేశాలను, ప్రత్యర్థి నాయకులను.. యుద్ధం, తమ అణుశక్తి పాటవాన్ని చూపించి బెదిరించిన పరిస్థితులుండేవి. ఎవరి దగ్గర రక్షణ బలం అధికంగా ఉంటే..ప్రత్యర్థులు జీ అని శిరసావహించేవారు. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పైసా ఖర్చు చేయకుండా వాణిజ్యయుద్ధం చేయడం ద్వారా.. ప్రత్యర్థులను వారంతట వారే దారికి వచ్చేలా చేస్తున్నారు. ఇందులో ఆరితేరారు అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్.
టారిఫ్ ల ప్రకటనలతో మెక్సికో, పనామా వంటి దేశాలను దారికి తెచ్చుకుంటున్నారు. రష్యా బలమైన ప్రత్యర్థి కాబట్టి.. వాణిజ్య ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే పుతిన్(putin).. ఇలాంటివి ఎన్నో చూశారు కాబట్టి బెదరడం లేదు. ఓవైపు సత్సంబందాలు నెరుపుతూనే, మరోవైపు వాణిజ్యయుద్ధమంటూ బెదిరింపులు చేస్తున్నారు. తెగేదాక లాగితే పుతిన్ తో కష్టమేనని ట్రంప్ కూడా తెలుసని చెప్పొచ్చు.
ఇక ఉక్రెయిన్ తో సంబంధాల విషయంలో వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు. ఇన్నాళ్లు భారీగానే ఆర్థికసాయం చేసింది అమెరికా. ఇప్పుడు ఉక్రెయిన్ తోనూ యుద్ధానికి సంబంధించి డీల్ కుదుర్చుకుంటున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా చేస్తున్న సాయానికి.. 500 మిలియన్ డాలర్ల డీల్‌ను ప్రతిపాదించగా, దీనికి వారు సైతం అంగీకరించారన్నారు. ఈ డీల్‌లో భాగంగా కీవ్ అధీనంలోని అరుదైన ఖనిజాలను అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు గ్యాస్‌ను కూడా సరఫరా చేయాల్సివస్తుంది. తమకు ఖనిజాలు లభిస్తే.. ఆ దేశానికి అవసరమైన వాటిని అందిస్తామన్నారు.
‘వారు (రష్యా- ఉక్రెయిన్‌లను ఉద్దేశిస్తూ) ఒప్పందం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. ఉక్రెయిన్‌లు రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా ఉక్రెయిన్‌తో 500 మిలియన్ డాలర్ల డీల్‌తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో కీవ్‌కు పంపనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇక, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) వచ్చేవారం మ్యానిచ్‌లో జెలెన్‌స్కీతో భేటీ అవుతారని అక్కడి అధికారి తెలిపారు.
దాదాపు మూడేళ్లుగా ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. అయినా ఎక్కడా ముగింపుఛాయలు కనిపించడం లేదు. ఈక్రమంలో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. తాను యుద్ధాన్ని ఆపేస్తానని పలుమార్లు పేర్కొన్నారు. అందులోభాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin)లు శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. రష్యా చర్చలకు వచ్చేందుకు నిరాకరిస్తే.. ఆంక్షలు విధిస్తానంటూ హెచ్చరికలు సైతం చేశారు.