YS Jagan: ప్రతిపక్ష హోదా కోసం మళ్లీ హైకోర్టుకు జగన్..! కీలక ఆదేశాలు..!!

తనకు ప్రతిపక్ష హోదా (opposition status) కల్పించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మరోసారి హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu), శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) కు నోటీసులు జారీ చేసింది. గతంలో జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను ఈ కేసుతో కలిపి విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 స్థానాలు కావాలి. అయితే అలా అని చట్టంలో ఎక్కడా లేదని, స్థానాలతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చని చెప్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ లేఖ రాశారు. జగన్ లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఒక రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలు అనుమతించబోవని స్పష్టం చేశారు.
స్పీకర్ రూలింగ్ అసంబద్ధంగా ఉందంటూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధం అని ఆదేశాలివ్వాలని, తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా రూలింగ్ ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు పార్టీల్లో మూడు అధికారంలో ఉన్నాయని, మిగిలన ఏకైక పార్టీ తమదేనని చెప్పారు. కాబట్టి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరారు. ఈరోజు హైకోర్టులో జగన్ తరపున సీనియర్ అడ్వొకేట్ ఏ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి ప్రసన్నకుమార్ కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. అయితే జగన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ ను కూడా దీనితో కలిపే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరు కావాలని వైసీపీ ఇప్పటికే నిర్ణయించుకుంది.