చైనాకు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్
డ్రాగన్ కంట్రీకి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. చైనా సాఫ్ట్వేర్ అప్లికేషన్ల లావాదేవీలను బ్యాన్ చేశారు. చైనా బిలియనీర్ జాక్ మా యాంట్ గ్రూప్‌నకు చెందిన అలీ పే సహా ఎనిమిది చైనీస్ అప్లికేషన్లపై బ్యాన్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. నిషేధంతో చైనీస్ టెక్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు చెందిన వుయ్చాట్పేతో సహా పలు కంపెనీలకు చెందిన యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. ట్రంప్ పదవి నుంచి వైదొలగిన తర్వాత 45 రోజుల్లోగా నిర్ణయం అమల్లోకి వస్తుంది.
జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అప్లికేషన్లను పరిశీలించాలని వాణిజ్య కార్యదర్శి లిల్బర్ రాస్‌ను ఆదేశించారు. అమెరికాకు చెందిన వినియోగదారుల డేటాను బదిలీ చేయకుండా నిరోధించేందుకు సిఫారసులతో కూడిన నివేదికను విడుదల చేయాలని వాణిజ్య కార్యదర్శి, అటార్నీ జనరల్, జాతీయ ఇంటెలిజెన్స్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. బ్యాన్ చేసిన అప్లికేషన్ వినియోగదారుల నుంచి ప్రైవేట్ సమాచారాన్ని యాక్సెస్ చేయగలవని ట్రంప్ పేర్కొన్నారు. ఆ సమాచారాన్ని చైనా ప్రభుత్వం ఫెడరల్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల స్థానాలను ట్రాక్ చేయడంతో పాటు వ్యక్తిగత డేటాను వినియోగించుకునే ప్రమాదం ఉందన్నారు.






