Anti Trump Movement: ట్రంప్ పై అమెరికన్ల ఆగ్రహం.. దేశవ్యాప్తంగా ర్యాలీల పర్వం..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అంటూ దూకుడు కొనసాగిస్తున్నారు. తన విధానాలతో ప్రపంచదేశాలపై టారిఫ్ లు విధిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతే కాదు.. ఉద్యోగాల్లో కోత సహా కీలకాంశాల్లో ట్రంప్ అస్సలు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు విదేశీయులను డిపోర్టేషన్ పేరుతో బెంబేలెత్తిస్తున్నారు. ఈపరిణామాలతో అమెరికాకు తర్వాత లాభం కలుగుతుందేమో కానీ.. ప్రస్తుతం మాత్రం అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఏదో కిందిస్థాయి ఎంప్లాయీస్ మాత్రమే కాదు..ఫెడ్ చైర్మన్ సైతం అమెరికా అధ్యక్షుడి తీరును తప్పు పడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించి కొన్ని నెలలే అయినా, ఆయన పాలన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ర్యాలీలు, ప్లకార్డులతో నినాదాలు, శాంతియుత కవాతులతో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు
ఎందుకు ఈ నిరసనలు?.. జనాల్లో పెరిగిన అసంతృప్తి ఏమిటి?
ట్రంప్ తీసుకున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాలు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా ఆయన తీసుకువచ్చిన..సుంక విధానాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మధ్యతరగతిపై భారం పడుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
ఫెడరల్ ఉద్యోగాల కోతలు: లక్షల మందికి ఉపాధి రాహిత్యాన్ని కలిగిస్తున్నాయని ఆందోళనలు పెరుగుతున్నాయి.
పౌర హక్కుల ఉల్లంఘనలు: భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛపై నియంత్రణలు మరింత ఆందోళనలు పెంచుతున్నాయి..వలస విధానాల్లో మార్పులు, న్యాయవ్యవస్థను అణిచే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ పాలన నైతిక, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉందని నిరసనకారులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా 400 ర్యాలీలు – ఉద్యమ తీవ్రత ..
ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే నుండి కేలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ వరకూ 400కి పైగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఇవి చిన్న చిన్న గ్రూపుల నుండి పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థలు వరకు నిర్వహించాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ పరంగా కాకుండా, అన్ని వర్గాల ప్రజలు – విద్యార్థులు, ముస్లింలు, మహిళలు, అఫ్రో-అమెరికన్‌లూ ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు.ఈ ఉద్యమం స్వార్థపూరితంగా కాకుండా, దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే సంకల్పంతో జరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నాల్గవ భారీ స్థాయి నిరసన. ఫిబ్రవరిలో ‘ప్రెసిడెంట్స్ డే’ సందర్భంగా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సోషల్ మీడియాలో ట్రంప్ తనను తాను “రాజు”గా అభివర్ణించుకున్నట్టుగా వచ్చిన వ్యాఖ్యలు ప్రజల్లో మరింత కోపాన్ని రేకెత్తించాయి. అప్పటి నుండి ఈ ఉద్యమం ఉధృతమవుతూ వస్తోంది. ఈ నిరసనలు కేవలం ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం కావు. ఇవి ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలకు మద్దతుగా ఉన్న పోరాటాలు. అమెరికాలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఎంతగా విలువైనదిగా భావిస్తున్నారో, ఈ నిరసనల ద్వారా స్పష్టమవుతోంది. ట్రంప్ పాలన ప్రజల అంచనాలను నెరవేర్చకపోతే, ఇది ఎన్నికల వరకు కొనసాగే ఉద్యమంగా మారే అవకాశం ఉంది.