Phone Tapping: ప్రభాకర్ రావు రిలీజ్.. నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీశేనా?
తెలంగాణ రాజకీయ యవనికపై పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు సిట్ అధికారుల విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల పాటు ఆయన్ను తమ కస్టడీలో ఉంచుకుని విచారించిన సిట్, గడువు ముగియడంతో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ను విడుదల చేసింది. అయితే, ప్రభాకర్ రావు విడుదలతో ఈ కేసు ముగిసిపోలేదని, అసలు కథ ఇప్పుడే మొదలైందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ప్రభాకర్ రావు నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సంస్థ తదుపరి అడుగులు వేయబోతోంది. గులాబీ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ట్రబుల్ షూటర్ హరీశ్ రావు (Harish Rao)ల మెడకు ఈ కేసు ఉచ్చు బిగుస్తోందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావును అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధానంగా ఆయన ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నిఘా, ఫోన్ల ట్యాపింగ్, హార్డ్ డిస్క్‌ల ధ్వంసం వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో ఆయన తొలుత అధికారులకు సహకరించలేదని, సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేశారని సమాచారం. దీంతో సిట్ అధికారులు తమ వ్యూహాన్ని మార్చి, ఇప్పటికే కస్టడీలో ఉన్న మరో నిందితుడు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావును విచారించారు. ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించినప్పుడు, కొన్ని కీలక విషయాలపై ఆయన మౌనం వహించారని, మరికొన్నింటికి పొంతన లేని సమాధానాలు చెప్పారని తెలుస్తోంది.
సిట్ ప్రధానంగా ఫోకస్ చేసిన అంశం.. ప్రభాకర్ రావు రీ-అపాయింట్మెంట్. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా, నిబంధనలకు విరుద్ధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబీ చీఫ్‌గా ఎందుకు నియమించింది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేవలం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికే ఈ నియామకం జరిగిందా అనే కోణంలో సిట్ ఆరా తీసింది. దీనికి తోడు, అప్పటి మంత్రి హరీశ్ రావుతో ప్రభాకర్ రావు తరచూ ఎందుకు భేటీ అయ్యారన్న ప్రశ్నపై ఆసక్తికర చర్చ నడిచింది. “మావోయిస్టుల ముప్పు, నక్సల్స్ కార్యకలాపాల గురించి వివరించడానికే హరీశ్ రావును కలిసేవాడిని” అని ప్రభాకర్ రావు సమర్థించుకున్నట్లు తెలిసింది. అయితే, మావోయిస్టుల అంశం హోంమంత్రి లేదా సీఎం పరిధిలోకి వస్తుంది తప్ప, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు ఇందులో సంబంధం ఏముంటుందన్నది సిట్ అనుమానం. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నది అధికారుల ప్రాథమిక అంచనా.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే. ప్రభాకర్ రావు వంటి సీనియర్ అధికారి, ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ ఆపరేషన్ నిర్వహించే సాహసం చేస్తారా? అనేది సామాన్యుడికి కూడా వచ్చే సందేహం. ఈ కేసులో ‘కింగ్ పిన్’లు తెరవెనుక ఉన్నారని, అధికారులు కేవలం పావులేనని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిట్ తదుపరి చర్యలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల వైపు మళ్లినట్లు స్పష్టమవుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ప్రభాకర్ రావు విచారణలో వెల్లడైన అంశాలు బీఆర్ఎస్ అగ్రనేతలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని రెబల్స్, జర్నలిస్టులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి, ఆ సమాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, అతి త్వరలోనే కేటీఆర్, హరీశ్ రావులకు, ఆ తర్వాత కేసీఆర్‌కు కూడా విచారణ నోటీసులు జారీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.
ప్రభాకర్ రావు విడుదలైన రోజే.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం సాధారణమైంది కాదని, ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ఫిష్ లను ఎలా డీల్ చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వంటి ఉన్నతాధికారుల వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసింది. వారు ఇచ్చిన సమాచారం కూడా గత ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అందరి దృష్టి జనవరి 16పైనే ఉంది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో వెలుగుచూసిన అంశాలతో కూడిన సమగ్ర నివేదికను ఆ రోజు సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ రిపోర్టులో సిట్ ఏం చెప్పబోతోంది? రాజకీయ నాయకుల ప్రమేయంపై కోర్టుకు ఎలాంటి ఆధారాలు చూపబోతోంది? అన్నది ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు, సిట్ సమర్పించే నివేదిక ఆధారంగానే తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్ పరిణామాలు ఉండబోతున్నాయి.






