Chinna Reddy: అమెరికాలో తెలంగాణ వాసులకు అండగా నిలువాలి: చిన్నారెడ్డి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురుకుంటున్న తెలంగాణ విద్యార్థులు, ఎన్ఆర్ఐలకు న్యాయపరంగా అండగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి (Chinna Reddy) అమెరికా న్యాయ నిపుణుల బృందానికి సూచించారు. ప్రజా భవన్ లో టీపీసీసీ ప్రవాసి విభాగం కన్వీనర్ బొజ్జ అమరేందర్ రెడ్డి (Bojja Amarender Reddy) ఆధ్వర్యంలో అమెరికా న్యాయ శాఖ ఆటార్నిలు జోషువా డాల్రైంపుల్ (Joshua Dalrymple), యహ్వా తాబిట్, సోమిరెడ్డి సంతోష్ రెడ్డి (Santosh Reddy) , విజయ్ ఎల్లారెడ్డి (Vijay Yella Reddy) తో కూడిన న్యాయ నిపుణుల బృందం చిన్నారెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయింది.
ఈ సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో నివాసం ఉంటున్న వారితోపాటు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థులు (Students) కూడా తీవ్ర భయాందోళనలతో ఉన్నారని అన్నారు. వారికి ఇమ్మిగ్రేషన్, వీసాలు, ఉద్యోగ అభద్రత, కార్పొరేట్ లీగల్ సపోర్ట్ అందించాలని చిన్నారెడ్డి అమెరికా న్యాయ నిపుణులకు సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో న్యాయ సేవలు అందించే అమెరికా సంస్థ తెలంగాణలో తమ సేవలను ప్రారంభించడం రాష్ట్ర వాసులకు భరోసానిస్తుందని పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల వీసా సమస్యలపై, అమెరికాలో వ్యాపారం చేయదలచిన సంస్థలకు న్యాయ సహాయం, లిటిగేషన్ సేవలు, విద్యార్థులకు యూఎస్ శిక్షణ అవకాశాలు ఇవన్నీ హైదరాబాద్ నుంచే నిర్వహించేందుకు సోమిరెడ్డి లా గ్రూప్ సీఈవో సంతోష్ రెడ్డి ముందుకు రావడం హర్షణియమని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణను గ్లోబల్ లీగల్, టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక గొప్ప అడుగు అని ఆయన అన్నారు. అమెరికాలోని సోమిరెడ్డి లా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో సోమిరెడ్డి సంతోష్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం చిన్నారెడ్డిని కలిసింది.