Kavitha – Jagadeesh Reddy: కవిత-జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం..! దేనికి సంకేతం..?

భారత రాష్ట్ర సమితి (BRS)లో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై (Jagadeesh Reddy) తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం మరింత ఉద్ధృతమైంది. కవిత జగదీశ్ రెడ్డిని “లిల్లీపుట్ నాయకుడు” అంటూ విమర్శించగా, ఆయన కూడా కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె జ్ఞానానికి జోహార్లు అని సెటైరికల్‌గా స్పందించారు. ఈ మాటల యుద్ధం బీఆర్ఎస్‌లో విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె కవిత, తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అనే సాంస్కృతిక సంస్థ ద్వారా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆమె పార్టీలోని సీనియర్ నాయకులపై, ముఖ్యంగా తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఏడాది మేలో కవిత కేసీఆర్‌కు రాసిన ఒక రహస్య లేఖ బయటకు రావడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ లేఖలో ఆమె కేసీఆర్‌ను “దేవుడు”గా పోల్చి, ఆయన చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయని వ్యాఖ్యానించారు. పార్టీలోని కొందరు సీనియర్ నాయకులను ఉద్దేశించే కవిత ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. తాజాగా, కవిత తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) వెనుక బీఆర్ఎస్‌లోని ఒక సీనియర్ నాయకుడు ఉన్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె జగదీశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పతనానికి ఆయనే కారణమని విమర్శించారు. “కేసీఆర్ లేకపోతే నీవు ఎవరు?” అని ప్రశ్నిస్తూ, జగదీశ్ రెడ్డి సుర్యాపేటలో గెలవడం కూడా అదృష్టవశాత్తు జరిగిన విజయమేనని ఆమె వ్యాఖ్యానించారు.
జగదీశ్ రెడ్డి, కవిత వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను ప్రశ్నించినందుకు జోహార్లు అని సెటైర్ వేశారు. ఆయన తన విజయాలు, ఓటములకు బాధ్యత వహిస్తానని, కవిత బీఆర్ఎస్ వ్యతిరేకులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వంటి వారి భాషను పునరావృతం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌తో తన సమావేశాల్లో కవిత గురించి ఎప్పుడూ చర్చించలేదని, రైతుల సమస్యలు, గోదావరి నీటి వినియోగం వంటి అంశాలపైనే మాట్లాడినట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఎక్కడా స్పందించలేదు. ఆమె తన సోదరుడు కేటీఆర్‌తో సహా సీనియర్ నాయకులను విమర్శించినప్పటికీ, పార్టీ నాయకత్వం నిశ్శబ్దంగా ఉండటం గమనార్హం. అయితే, జగదీశ్ రెడ్డి ఈసారి బహిరంగంగా స్పందించడం ఒక కీలక పరిణామం. కేసీఆర్ ఆదేశాల మేరకే జగదీశ్ రెడ్డి ఈ కామెంట్స్ చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. కవితతో తాడోపేడో తేల్చుకునేందుకు లేదా ఆమె పార్టీలో ఆమె పాత్రను పరిమితం చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని వారు అంచనా వేస్తున్నారు.
కవిత ఇప్పటికే తెలంగాణ జాగృతి ద్వారా స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పార్టీ నుంచి కవితకు ఏమాత్రం సహకారం అందట్లేదు. దీంతో కవిత వేరుకుంపటి పెట్టడం ఖాయమని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇటీవల బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల ఆమరణ దీక్ష చేపట్టాలని కవిత ప్రకటించారు. ఇది కాంగ్రెస్, బీజేపీలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే, ఆమె ఈ కార్యకలాపాలను బీఆర్ఎస్ బ్యానర్ కాకుండా తెలంగాణ జాగృతి ద్వారా చేపట్టడం పార్టీలో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. అంతేకాక ఇటీవల యూత్ వింగ్ తో కవిత సమావేశమయ్యారు. అదేరోజు బీఆర్ఎస్ కూడా యూత్ వింగ్ సమావేశం నిర్వహించడం గమనార్హం.
బీఆర్ఎస్‌లో కవిత, జగదీశ్ రెడ్డి మధ్య జరుగుతున్న వివాదం పార్టీలో లోతైన విభేదాలను సూచిస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఐక్యతను కాపాడుకుంటుందా లేక ఈ అంతర్గత సంక్షోభం మరింత లోతవుతుందా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. ప్రస్తుతానికి, కవిత వ్యాఖ్యలు, జగదీశ్ రెడ్డి కౌంటర్‌లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.