Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్‌గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి

తెలంగాణకు చెందిన విహా రెడ్డి జొన్నలగడ్డ (Viha Reddy Jonnalagadda) చరిత్ర సృష్టించింది. మలేసియా వేదికగా జరగనున్న ఎఫ్ఐబీఏ అండర్-16 మహిళల ఆసియా కప్‌లో తలపడే భారత బాస్కెట్‌బాల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఆమె ఎంపికైంది. సెప్టెంబరు 13 నుంచి 19 వరకు ఈ అంతర్జాతీయ పోటీ జరగనుంది. బాస్కెట్ బాల్‌లో ఎంతో అనుభవం ఉన్న విహా.. ఇప్పటి వరకు ఏడుసార్లు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పలు పోటీల్లో తలపడింది. హైదరాబాద్‌లోని రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆమె.. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఎస్ఓ) అండర్-17 నేషనల్స్‌లో ఆడింది. ఐఎస్ఎస్ఓ అండర్-19 టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించిన జట్టులో సభ్యురాలిగా ఉంది. నల్గొండ జిల్లా మడుగులపల్లి మండలం గారకుంటపాలెంకు చెందిన విహా.. తెలంగాణ నుంచి భారత జట్టుకు ఎంపికైన అమ్మాయి. అంతేకాదు తెలంగాణ నుంచి భారత్‌కు వైస్ కెప్టెన్‌గా నియమితురాలైన తొలి ప్లేయర్ కూడా కావడం విశేషం.
విహా తండ్రి శ్రీ వెంకటరెడ్డి జొన్నలగడ్డకు కూడా దేశభక్తి ఎక్కువే. గతంలో అమెరికాలోని వర్జీనియాలో ఐటీ ఉద్యోగం చేసిన ఆయన.. మాతృభూమిపై, మాతృరాష్ట్రంపై మమకారంతో స్వదేశానికి తిరిగి వచ్చేశారు. తెలంగాణలోనే సొంతంగా బిజినెస్ పెట్టి పలువురికి ఉద్యోగాలిచ్చారు. తండ్రికి తగ్గ తనయగా పేరొందిన విహా.. దేశం తరఫున బాస్కెట్ బాల్‌లో రాణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతి సంపాదిస్తోంది.