Uttam Kumar Reddy: సొరంగం కూలిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే కారణమని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. గత ప్రభుత్వం సొరంగంలో నీటి తొలగింపు పనులు సకాలంలో చేపట్టి ఉంటే, ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఎస్ఎల్‌బీసీ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. రెండు రోజుల్లో ఈ పనులను పూర్తి చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, రెండు నెలల్లో తిరిగి సొరంగం తవ్వకాల పనులు ప్రారంభిస్తామన్నారు.
గ్రావిటీ ద్వారా 30 టీఎంసీల నీటిని తీసుకునే ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. ‘ఈ టన్నెల్‌ను (SLBC Tunnel) సకాలంలో పూర్తి చేసి ఉంటే, 4.50 లక్షల ఎకరాలకు నీరు అందేది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ కేవలం వారి జేబులు నింపుకోవడానికే’ అని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మూడేళ్లకే కూలిపోయిందని ఆయన (Uttam Kumar Reddy) విమర్శించారు. ‘గతంలో శ్రీశైలం పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగి ఆరుగురు ఉద్యోగులు మృత్యువాత పడినప్పుడు కూడా కేసీఆర్ ఘటనా స్థలానికి వెళ్లి పరామర్శించలేదు. అలాగే, పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ (KCR) స్పందించలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది భక్తులు చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ ఘటనా స్థలానికి వెళ్లలేదు. మాసాయిపేట రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ (KCR) పరామర్శించలేదు’ అని ఉత్తమ్ (Uttam Kumar Reddy) గుర్తుచేశారు.
ఇప్పుడు హరీశ్ రావు (Harish Rao) మాత్రం ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. హరీశ్ రావుకు అనుభవం ఉంటే, పదేళ్లలో ఈ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. సొరంగంలో (SLBC Tunnel) నిపుణుల చర్యలకు ఇబ్బంది కలిగించకూడదని, అందరినీ లోపలికి పంపించడం లేదని వివరించారు. ప్రస్తుతం బురద తొలగింపు పనులు జరుగుతున్నాయని, ఈ పనులు పూర్తయ్యాక మిషన్ శిథిలాలను తొలగిస్తామని ఉత్తమ్ (Uttam Kumar Reddy) పేర్కొన్నారు.