జీనోవ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ కేంద్రం

అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్చూన్-500 థర్మోఫిషర్ సైంటిఫిక్ సంస్థ హైదరాబాద్‌లోని జీనోవ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 2025 తొలి త్రైమాసికం నాటికి ఈ డిజైన్ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి, థర్మోఫిషర్ సైంటిఫిక్ సంస్థకు ఎంవోయూ పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ సంస్థ ఏర్పాటుతో స్థానికంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ సంస్థ రాష్ట్రానికి రావడం సంతోషకరం. 1,800 బయో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుతో దేశంలోనే రాష్ట్రం ఔషధ ఉత్పత్తి, పరిశోధనలకు కేంద్ర బిందువుగా మారింది. జీనోమ్ వ్యాలీ మూడో దశ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో మరిన్ని ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. నవంబరు 18న పార్మా రంగానికి అవసరమయ్యే కృత్రిమ మేధ సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో థర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులు ఫ్రెడో లోవెరీ, డేనియెల్లా క్రాంప్, టోనీ అస్సియారిటో, శ్రీనాథ్ వెంకటేశ్, సరితా రావత్, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో శక్తి నాగప్పన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.