టీటీఎఫ్ హైదరాబాద్ 2022 ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్) హైదరాబాద్ 2022 తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4 దేశాలు, 150 స్టాళ్లు, 19 రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిజం ప్రతినిధులు టూరిజం ప్రచారంలో భాగంగా టూరిజం స్టాల్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం అనేక చర్యలను చేపట్టారన్నారు. కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందన్నారు. అలాగే భూదాన్ పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం గ్రామంగా గుర్తింపు లభించిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, పర్యాటకాభివృద్ది సంస్థ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీటీఎఫ్ చైర్మన్ సంజీవ్ అగర్వాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.






