Tiger: తెలంగాణాకు 11 పులులు, ఆడపులి తోడు దొరకడంతో మగపులి సెటిల్…

ఆడుతూ పాడుతూ పొలాలకు వెళ్ళే కూలీలు… పశువులను మేపుకుంటూ అడవులకు వెళ్ళే కాపరులు.. చిన్న చిన్న పొలాలు సాగు చేసుకుంటూ బ్రతుకు నెట్టుకొచ్చే రైతులు.. ఇప్పుడు ప్రాణం అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఎక్కడ ఏ గాండ్రిపు వినపడుతుందో… ఏ వైపు నుంచి ప్రాణం తీసే బెబ్బులి తమపై దాడి చేస్తుందో తెలియక వణికిపోతున్నారు. మహారాష్ట్ర-తెలంగాణా(Telangana) సరిహద్దు జిల్లాల్లో ఇప్పుడు బెబ్బులి పేరు వింటే వెన్నులో వణుకుపుడుతోంది. పొలాల్లో అడుగులు చూస్తే ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులుల(Tigers) తో నిత్యం టెన్షన్ టెన్షన్ గా మారింది కొమరంభీమ్ జిల్లా. తోడు కోసం బార్డర్ దాటిన నాలుగు మగ పులులు, రెండు ఆడపులులు ఇప్పుడు ప్రజలను కంగారు పెడుతున్నాయి. కొమురంభీం – మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో 100 కిమీల పరిదిలో 11 పులుల సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారికంగా మాత్రం బయటపెట్టడం లేదు. బెబ్బులలతో సహవాసం తప్పదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
ఒక్క కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ కారిడార్ లోని ఆరు మండలాల పరిదిలో 8 పులుల సంచారం కలవరపెడుతోంది. సిర్పూర్ ( యు ) , కాగజ్ నగర్ , పెంచికల్ పేట మండలాల పరిదిలో వలస వచ్చిన పులులు సంచరిస్తున్నాయి. సిర్పూర్ ( యు ) మండలం ఇటిక్యల్ పాడ్ సమీపంలో వలస వచ్చిన మగపులి తిష్ట వేసింది. ఆడతోడు దొరకడంతో ఆవాసం ఏర్పాటు చేసుకుంది నాలుగేళ్ల మగ పులి. పెంచికల్ పేట మండలం ఎర్రగుంట గ్రామ శివారులో మరొ పులి కదలికలను గుర్తించారు.
బొంబాయిగూడ గ్రామ శివారులోని ఉచ్చమల్ల వాగుతో పాటు సమీప పంట చేనుల్లో పులి పాదముద్రలను మేకలకాపరులు… అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మంచిర్యాల జిల్లా ముల్కల్ల బీట్ పరిదిలోను మరో ఆడపులి సంచారాన్ని గుర్తించారు అటవి అధికారులు. ముల్కల బీట్ సఫారీ రోడ్ పై ట్రాప్ కెమెరాలకు వలసొచ్చిన ఆడపులి చిక్కింది. మంచిర్యాల జిల్లా మందమర్రి, అందుగుల పేట, తాండూరు మండలం నీలాయపల్లి సమీపంలో మగ పులి సంచారం కలకలం రేపుతోంది. తడోబా నుండి రెండు మగపులులు ఒక ఆడపులి వలస వచ్చినట్టు ప్రాథమికంగా అటవిశాఖ గుర్తించింది. ఇక మహరాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో రాకాసి పులిని బందించాలని అటవీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పులిని బందించడానికి అనుమతి ఇవ్వాలని మహరాష్ట్ర పీసీసిఎప్ కు లేఖ రాసారు.
అనుమతి రాగానే పులిని బందిస్తామని మహరాష్ట్ర అటవీ అదికారులు చెప్తున్నారు. మహరాష్ట్ర లో చంద్రపూర్ జిల్లాలో ఇధ్దరిని చంపిన పులి, కుమ్రంబీమ్ జిల్లాలో ఒకరిని చంపి మరోకరిని తీవ్రంగా గాయపరిచింది. రాకాసిపులిని బందించాలని మహరాష్ట్ర ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడి ఉన్న నేపధ్యంలో అధికారులు అలెర్ట్ అవుతున్నారు. ప్రజల ఒత్తిడి మేరకు బందించాలని అటవీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. తెలంగాణ , మహరాష్ట్ర సరిహద్దులో సంచరిస్తున్న పులి… కుమ్రంబీమ్ జిల్లా ఇటిక్యాల్ పహడ్ కు అతి సమీపంలో సంచరిస్తున్నది.