Kaleswaram Report: కాళేశ్వరం రిపోర్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్..!!

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ నివేదికను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆదివారం ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ నివేదిక చుట్టూ రాజకీయం మొదలైంది. అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది, మరోవైపు కేసీఆర్ (KCR), హరీష్ రావు (Harish Rao) హైకోర్టులో హౌస్ పిటిషన్లు దాఖలు చేశారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
2014-2023 మధ్య బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు రూ. 1.1 లక్షల కోట్ల బడ్జెట్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసి రాష్ట్రంలో 18.25 లక్షల ఎకరాలకు సాగునీటి అందించాలనే లక్ష్యంతో ఇది రూపొందింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇందులో ముఖ్యమైనవి. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోయాయి. అంతేకాక అంచనాలకు మించి ఖర్చు కావడం, నిర్మాణంలో లోపాలు, డిజైన్ లలో మార్పులు తెరిపైగి వచ్చాయి.
2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీ 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 15 నెలల విచారణ తర్వాత 2025 జులై 31న 665 పేజీల నివేదికను కమిషన్ సమర్పించింది. 2015లో మేడిగడ్డ బ్యారేజ్‌పై నిపుణుల హెచ్చరికలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని కమిషన్ తేల్చింది. కేసీఆరే ఈ తప్పులకు బాధ్యుడని తేల్చింది. అంతేకాక హరీష్ రావు, ఈటల రాజేందర్, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, స్మితా సభర్వాల్, మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళిధర్, బి.హరి రామ్ లాంటి అధికారులు కూడా బాధ్యులని తేల్చింది.
ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం నివేదికను ప్రవేశపెట్టి సోమవారం నుంచి దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. తమ వాదనలను వినిపించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతి ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఏసీలో స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ నేతలకు మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, బీఆర్ఎస్ డిమాండ్లను అధికార పార్టీ తోసిపుచ్చింది. “గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో మేము పలుమార్లు పీపీటీ అనుమతి అడిగినా ఇవ్వలేదు. కేసీఆర్ 2015లో కాళేశ్వరం పై పీపీటీ ఇచ్చినా, విపక్షాలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు వారికి ఎందుకు?” అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు.
మరోవైపు, కాళేశ్వరం నివేదికపై బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ శనివారం హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంతకుముందే ఆగస్టు 19న కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. తదుపరి విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్, హరీశ్ రావు.
మొత్తానికి అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం, దాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఇంతలో హైకోర్టు ఎలాంటి తీర్పు చెప్తుందనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఒకవేళ హైకోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీ దద్దరిల్లే అవకాశం ఉంది.