Local body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు!

తెలంగాణలో (Telangana) స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నిర్వహణపై గత 18 నెలలుగా నెలకొన్న అనిశ్చితికి తెలంగాణ హైకోర్టు (Telangana High court) తాజాగా తెరదించింది. సెప్టెంబర్ 30లోగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ టి.మాధవీ దేవి ఈ కీలక తీర్పును వెలువరించారు. దీనితో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది.
గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గతేడాది జనవరి 31న ముగిసింది. అయినా ఇప్పటివరకూ ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతున్నాయి. దీనిపై నల్లగొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆరుగురు మాజీ సర్పంచులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల్లో నిర్వహించాలని పంచాయతీ రాజ్ చట్టం-2018 స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, 18 నెలలు గడిచినా ఎన్నికలు జరగలేదని వారు వాదించారు. స్పెషల్ ఆఫీసర్ల నియామకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E, 243K, పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు తమ వాదనల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, స్పెషల్ ఆఫీసర్లు ఇతర విధులతో బిజీగా ఉండటంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు అందుతాయన్న హామీతో చాలా మంది సర్పంచులు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారని, ఆ నిధులు ఇంకా చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. వెనుకబడిన తరగతుల (BC) రిజర్వేషన్లను ఖరారు చేయడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను అనుసరిస్తున్నామని, దీనికి 30 రోజుల సమయం అవసరమని కోర్టుకు తెలిపారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఓటర్ల జాబితాతో పాటు ఇత ప్రక్రియలకోసం ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ కౌన్సెల్ విద్యాసాగర్ వాదించారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2025లోగా ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీని నిలబెట్టుకోలేదని కోర్టు గుర్తు చేసింది.
హైకోర్టు ఆదేశాలతో, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్ల ఖరారు వంటి పనులను 30 రోజుల్లో పూర్తి చేయాలని కోర్టు సూచించింది. ఈ తీర్పు స్థానిక పాలనలో ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాలకు కొత్త ఊపిరి లభిస్తుందని అంచనా. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం ప్రజలు, రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.