Margadarsi: ఉండవల్లికి నిరాశ.. ముగిసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు

మార్గదర్శి ఫైనాన్షియర్స్ (Margadarsi Financiers) పేరిట రామోజీ రావు అక్రమంగా డిపాజిట్లు (deposits) సేకరించారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) దాఖలు చేసిన కేసు ముగిసింది. దాదాపు 17 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసును తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టేసింది. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ కు నిరాశే మిగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను ఉల్లంఘించి రామోజీ రావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ రూ.2,600 కోట్ల డిపాజిట్లను సేకరించిందని ఆరోపిస్తూ 2008లో కేసు దాఖలైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నమోదైన ఈ కేసు అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేయడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ దీర్ఘకాల పోరాటం నిరాశాజనకంగా ముగిసింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ హిందూ ఉమ్మడి కుటుంబం (HUF) ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థగా ఉన్నప్పటికీ, RBI నిబంధనలను ఉల్లంఘించి ప్రజల నుండి డిపాజిట్లను సేకరించిందని 2006లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. RBI నియమాల ప్రకారం, HUF సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడానికి అనుమతి లేదు. ఈ ఆరోపణలతో 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు వివిధ కోర్టులలో సుదీర్ఘ విచారణలకు గురైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. HUF అనేది వ్యక్తుల సమూహంగా పరిగణించబడదని, అందువల్ల RBI నిబంధనలు దీనికి వర్తించవని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు 2020 ఆగస్టు 10న రామోజీ రావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో RBI, మాజీ ఐజీ కృష్ణరాజును కేసులో చేర్చాలని ఆదేశించింది. కృష్ణరాజు గతంలో రామోజీ రావు RBI నిబంధనలను ఉల్లంఘించి రూ. 2,600 కోట్ల డిపాజిట్లను సేకరించారని ఫిర్యాదు చేశారు.
మార్గదర్శి డిపాజిటర్ల వివరాలను బహిర్గతం చేయడంలో గోప్యం ఎందుకని 2023లో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. డిపాజిటర్లకు చెల్లింపులు పూర్తిగా చేసినట్లు మార్గదర్శి తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ, సుప్రీంకోర్టు ఈ వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంలో ఉండవల్లి ఈ కేసు 17 ఏళ్ల తన పోరాటంలో కీలక మలుపుగా పేర్కొన్నారు. అయితే 2024లో సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపింది. డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు 2024 సెప్టెంబర్ 26న డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులను ఆహ్వానిస్తూ పత్రికలలో ప్రకటన జారీ చేసింది. అయితే, ఒక్క డిపాజిటర్ కూడా ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇప్పటికే అన్ని డిపాజిట్లను తిరిగి చెల్లించేసింది.
2024 జూన్‌లో రామోజీ రావు మరణించడంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరపు న్యాయవాదులు ఈ కేసును కొట్టివేయాలని వాదించారు. రామోజీ రావు HUF కర్తగా ఉన్నారని, ఆయన మరణంతో ఈ కేసు కొనసాగించడానికి ఆధారం లేదని వారు పేర్కొన్నారు. అంతేకాక అన్ని డిపాజిట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించేశామని నొక్కి చెప్పారు. ఈ వాదనలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, ఇవాళ క్రిమినల్ కార్యకలాపాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఉండవల్లి అరుణ్ కుమార్ దీర్ఘకాల న్యాయ పోరాటం విఫలమైందని చెప్పొచ్చు.