KTR : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..!?

తెలంగాణలో రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య ఎత్తుకు పైఎత్తులు సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే ప్రజా ఉత్సవాలు నిర్వహించింది. అదే సమయంలో రేవంత్ సర్కార్ దారుణంగా విఫలమైందంటూ బీఆర్ఎస్ ప్రజలకు వద్దకు వెళ్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి ఏమాత్రం మింగుడుపడని ఓ పరిణామం జరగబోతోంది. అదే కేటీఆర్ అరెస్ట్.! అవును.. కేటీఆర్ అరెస్టుకు దాదాపు రంగం సిద్దమైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై కేసు నమోదు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) నిర్వహించింది. ఈ కార్ రేస్ నిర్వహణకు జరిగిన ఒప్పందంలో నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించారనే ఆరోపణలున్నాయి. HMDA, RBI అనుమతులు లేకుండానే డాలర్ల రూపంలో రూ.46 కోట్ల రూపాయల నిధులను ఆ సంస్థకు బదిలీ చేశారు. కేటీఆర్ చెప్పినందువల్లే ఈ నిధులను బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీని వెనుక కుట్ర ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిధులను బదిలీ చేయడం ద్వారా కేటీఆర్ అనుచిత లబ్ది పొందారని చెప్తోంది.
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏసీబీ (ACB) దీన్ని చేపట్టింది. ప్రాథమిక విచారణ అనంతరం అప్పటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజినీర్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ పైన కూడా కేసు పెట్టాలని ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ (Governor) అనుమతి అవసరమని భావించిన ప్రభుత్వం ఆ మేరకు ఓ లేఖ రాసింది. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా గవర్నర్ ను కలిసినప్పుడు ఆయనకు ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు నెలలు దాటుతున్నా గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఇటీవల ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ఓ బహిరంగ వేదికపై కూడా మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. అందుకే కేటీఆర్ పై కేసు పెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.
అయితే ఇప్పుడు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. న్యాయ సలహా తీసుకునేందుకే గవర్నర్ ఇంతకాలం సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులు సరేననడంతో గవర్నర్ ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ సహా ఇతరులపై కేసు నమోదు చేసే అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. తనపై కేసు పెడ్తే పెట్టుకోనివ్వండి అని కేటీఆర్ ఇప్పటికే వెల్లడించారు. అరెస్టు చేసి జైలుకు పంపిస్తే జిమ్ చేసి స్లిమ్ గా తయారవుతానని కూడా చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్టు (KTR Arrest) చేసేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసినట్లు టాక్ నడుస్తోంది.