KTR Arrest : ఈ వారంలోనే కేటీఆర్ అరెస్ట్..!?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అరెస్టుకు (Arrest) రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. కేటీఆర్ అరెస్టును చట్టపరంగా తీసుకునేందుకు గవర్నర్ (Governor) అనుమతి కూడా కోరింది ప్రభుత్వం. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేటీఆర్ అరెస్టుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ వారంలోనే కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందనే వార్త కొంతకాలంగా తెలంగాణలో జోరుగా వినిపిస్తోంది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కేటీఆర్ అనుచిత లబ్ది పొందారని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు రూ.50 కోట్ల రూపాయల నిధులను ఫార్ములా ఈ-రేస్ కంపెనీకి బదిలీ చేశారని.. ఇందుకు ఎలాంటి అనుమతులు లేవని చెప్తోంది. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కేటీఆర్ మెడకు ఈ వ్యవహారం చుట్టుకుంది. అయితే కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో రెండు నెలల కిందటే గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ఇన్ని రోజులూ గవర్నర్ నుంచి రిప్లై రాలేదు. అయితే ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం కేబినెట్ మీటింగ్ లో సహచర మంత్రులకు వివరించారు. ఇప్పటికే ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో అవినీతిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ విషయంలో చట్టప్రకారమే ముందుకు వెళ్ళాలని మంత్రులంతా అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే ఈ విషయం ఆలస్యమైందని.. ఆలస్యం చేయవద్దని మాత్రం సూచించారు. దీంతో సోమవారమే గవర్నర్ అనుమతి పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సమాచారం. చీఫ్ సెక్రటరీ (Chief Secretary) వాటిని ఏసీబీకి పంపుతారు.
ఏసీబీ ఆ పత్రాలను పరిశీలించిన అనంతరం మొదట కేటీఆర్ కు నోటీసులు జారీ చేసే వివరణ కోరే అవకాశం ఉంది. ఒకవేళ వివరణలతో సంతృప్తి చెందకపోతే అరెస్టుకు కూడా వెనకాడకపోవచ్చని సమాచారం. ఈ వారంలోనే ఈ తతంగమంతా పూర్తి చేసి అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయం గ్రహించిన బీఆర్ఎస్ పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. తన అరెస్టును కేటీఆర్ ఇప్పటికే గ్రహించారు. తనను అరెస్టు చేస్తే జైలుకు వెళ్లి జిమ్ చేసి స్లిమ్ అవుతానని ప్రకటించారు.