తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం కేసీఆర్తో భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మరియమ్మ లాకప్‌డెత్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. మరియమ్మ కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఆర్ధిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మల్లు వెల్లడించారు. ‘‘భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పురావృత్తం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరాం. ఎస్సీ మహిళ మరియమ్మ లాకప్ డెత్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చాం. ఎస్సీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులను కూడా సీఎంకు వివరించాం. మరియమ్మ కుటుంబానికి ఇల్లు కేటాయిస్తామని, వారికి ఆర్థిక సాయం కూడా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఇదే ప్రథమం. తమకు అపాయింట్‌మెంట్ కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. అయితే మరియమ్మ లాకప్‌డెత్ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి కూడా ఉన్నారు.
ఏం జరిగిందంటే….
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో మరియమ్మ అనే మహిళ లాకప్‌డెత్ జరగడం సంచలనం రేపింది. అడ్డగూడూరు మండలం గోవిందాపురంలోని ఓ చర్చి ఫాదర్ ఇంట్లో మరియమ్మ వంట మనిషిగా పనిచేస్తున్నారు. మరియమ్మను చూసేందుకు ఆమె కుమారులు వచ్చారు. ఆ సమయంలోనే తన ఇంట్లో 2 లక్షల రూపాయల చోరీ జరిగిందని, మరియమ్మ, ఆమె కుమారులే ఈ పని చేశారని చర్చి ఫాదర్ కేసు పెట్టాడు. దీంతో మరియమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ముగ్గుర్ని పోలీసులు విపరీతంగా కొట్టారు. పోలీసు దెబ్బలను తట్టుకోలేక మరియమ్మ పీఎస్‌లోనే మృతి చెందింది. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఎస్సై, కానిస్టేబుళ్లను బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేశారు.