Telangana: తెలంగాణా కేబినేట్ మార్పులు ఫిబ్రవరిలోనే…?

తెలంగాణ (Telangana)లో మంత్రివర్గంలో కొత్త మంత్రులు ఎప్పుడు వస్తారు అనేదానిపై దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth reddy) స్వయంగా కొంతమందికి హామీ ఇవ్వడం అలాగే అధిష్టానం కూడా కొంతమందిని క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పడం వంటివి ఈ మూడు నాలుగు నెలల నుంచి ప్రధానంగా మీడియాలో నానుతూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి క్యాబినెట్ లో మార్పులు చేర్పుల గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది.
ప్రధానంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC), ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా కొంతమంది క్యాబినెట్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మండవ వెంకటేశ్వరరావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా క్యాబినెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి పట్టుదలగా ఆయనను త్వరగా ఎమ్మెల్సీను చేసి క్యాబినెట్లోకి తీసుకుని సముచిత స్థానం కల్పించాలని పట్టుదలగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక క్యాబినెట్లో ముస్లింలకు ఇప్పటివరకు ప్రాతినిధ్య కల్పించలేదు. త్వరలోనే ముస్లిం నేతను కూడా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే కొన్ని జిల్లాలకు క్యాబినెట్లో అవకాశాలు లేవు. దీనితో వారిపై కూడా రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు మంత్రులు క్యాబినెట్లో ఉన్నారు. మరో మంత్రి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. ఇక భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా క్యాబినెట్ బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత కూడా క్యాబినెట్లో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం నుంచి కూడా ఆయన తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆయన విషయంలో అంత సానుకూలంగా లేరనే వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం స్వయంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనితో ఆయనను కచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయం అనేది తెలుస్తుంది. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్ లో ఉన్నారు.