Azharuddin: ఎమ్మెల్సీగా అజారుద్దీన్..! మంత్రి పదవి ఖాయమా..?
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటాలో (Governor Quota) ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubilee Hills ) బరిలోకి దిగాలని భావిస్తున్న అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో ఆ స్థానంలో మరొకరికి జూబ్లిహిల్స్ టికెట్ ఇచ్చే ఉద్దేశం కనిపిస్తోంది. అజారుద్దీన్ తో పాటు కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీగా సిఫారసు చేసింది. అమిర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు అవకాశం కల్పించింది. అజారుద్దీన్ ఎంపిక వ్యూహాత్మకంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్న అజారుద్దీన్ ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా అవతారమెత్తారు. 2009లో కాంగ్రెస్లో చేరి, ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. 2014లో రాజస్థాన్ టోంక్-సావాయ్ మధోపుర్లో ఓడిపోయాడు. 2018లో తెలంగాణ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితుడయ్యాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఏడాది జూన్ 8న గుండెపోటుతో మరణించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. 2023లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అజారుద్దీన్ మళ్లీ టికెట్ ఆశిస్తున్నాడు.
అయితే ఇప్పుడు అనూహ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. దీంతో ఆయనకు ఇక జూబ్లిహిల్స్ టికెట్ నుంచి తప్పించినట్లయింది. ఆ స్థానంలో మరొక సమర్థవంతమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా సత్తా చాటాలనుకుంటోంది. అందుకే కులాలు, సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని సమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేసే ఉద్దేశంతో ఉంది. అందులో భాగంగానే అజారుద్దీన్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అయితే తెలంగాణలో ఈసారి మైనారిటీలను పెద్దగా పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి. ఆ విమర్శలకు ఇప్పుడు చెక్ పెట్టింది. అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు వీలైతే కేబినెట్ లోకి కూడా తీసుకునే అవకాశం ఉంది. రేవంత్ కేబినెట్ లో మైనారిటీ మంత్రి ఒక్కరు కూడా లేరు. అందుకే అజారుద్దీన్ కు ఆ అవకాశం లభించవచ్చని కొందరు భావిస్తున్నారు. మరోవైపు పార్టీలో 18 ఏళ్లుగా ఉన్న అజారుద్దీన్ కు అవకాశం కల్పించడం ద్వారా, పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికైనా అవకాశాలు లభిస్తాయనే సంకేతాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ.







