Tandanana: తందనానా – అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలు 2025

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని పద్మశ్రీ శ్రీమతి శోభారాజు (Shoba Raju) స్థాపించిన అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను, పోటీలను, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీ 2025 ని నిర్వహిస్తోంది. ‘తందనానా’ (Tandanana) పేరుతో ఈ పోటీలను ఏర్పాటు చేశారు.
అన్నమాచార్య 617వ జయంతిని పురస్కరించుకొని అన్నమాచార్య భావనా వాహిని(ఏబీవీ) ‘తందనాన’ పేరుతో ఏర్పాటు చేసిన అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలను హైదరాబాద్ మాదాపూర్‌లోని అన్నమయ్యపురంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నమయ్య కీర్తనల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఇమిడి ఉన్నాయని అన్నారు. అవన్నీ మన వ్యక్తిత్వాలను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. చిన్మయ మిషన్ హైదరాబాద్ సాక్షిరూపానంద స్వామీజీతో కలిసి శైలజా కిరణ్ ఈ పోటీలను ప్రారంభించారు.
తందనాన పేరుతో నిర్వహిస్తున్న ఈ సంగీత పోటీల్లో పాల్గొనేవారు ఆగస్టు 31వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అన్నమాచార్య భావన వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు శోభారాజు కోరారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 8న గ్రాంఢ్ ఫినాలే జరగనుండగా అమరావతిలో జరగనున్న బహుమతుల ప్రదానోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని వెల్లడిరచారు. ఈ పోటీల్లో అంతిమంగా ముగ్గురు విజేతలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేయనుండగా ఆ ముగ్గురికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ తరఫున 10 గ్రాముల చొప్పున బంగారు పతకాలను అందిస్తామని శైలజా కిరణ్ స్పష్టం చేశారు. ఈ పోటీల ఫ్లయర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి శోభారాజు ఇతరులు పాల్గొన్నారు. ఈటీవీ లైఫ్ స్ప్రిచ్చువల్ ఈ కార్యక్రమానికి భాగస్వామిగా ఉంది.
పద్మశ్రీ డా. శోభా రాజు 1983లో ఈ అన్నమాచార్య భావనా వాహిని స్థాపించారు, అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చేయడానికి, వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి తన జీవితాన్ని ఆమె అంకితం చేశారు. 1976 నుండి 1982 వరకు తిరుపతిలో అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి ఆమె విశేష కృషి చేసారు. తరువాత హైదరాబాద్ లో అన్నమాచార్య భావనావాహినిని ప్రారంభించి ఇప్పుడు అన్నమయ్య కీర్తనలను ప్రచారం చేస్తున్నారు. అనేకమందికి శిక్షణను కూడా ఇస్తున్నారు.
ఈ అంతర్జాతీయ పోటీలకు అమెరికాలో కో ఆర్డినేటర్‌గా తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు వ్యవహరిస్తున్నారు.