KTR : కేటీఆర్‌కు సుప్రీంకోర్టు షాక్..! ఈసారి అరెస్ట్ ఖాయమా..!?

తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-race Case) వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ను ఏసీబీ (ACB) అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అందుకే ఈ కేసు నుంచి బయట పడేందుకు కేటీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కేసును కొట్టివేయాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఫార్ములా ఈరేస్ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash Petition) ఇవాళ విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్ ను కొట్టివేయలేమని, కింది కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది.
ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt) కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారని ఆరోపించింది. నిధుల బదలాయింపునకు కారణమైన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను ఇందులో నిందితుడిగా చేర్చింది. దీంతో ఆయన్ను ఏసీబీ (ACB) విచారణకు పిలిచింది. అయితే ఈ కేసు కుట్రపూరితమని.. కక్షసాధింపులో బాగంగానే కేసు పెట్టారని ఆరోపిస్తూ కేటీఆర్ మొదట హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఈ క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో కేటీఆర్ కు పెద్ద షాక్ తగిలినట్లయింది.
రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారన్న కేటీఆర్ తరపు వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ప్రతిపక్ష నేతగా ఉంటే కేసు పెట్టకూడదా అని ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతగా ఉన్నా కేసులు ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో పిటిషన్ ను వెనక్కు తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. అయితే పిటిషన్ ను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించిన ధర్మాసనం.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని తెలిపింది. దీంతో పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయడంతో ఏసీబీ అప్రమత్తమైంది. ఈ కేసులో మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు దఫాలు నోటీసులు ఇవ్వగా మొదటిసారి విచారణకు కేటీఆర్ హాజరు కాలేదు. రెండోసారి న్యాయవాదుల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కేటీఆర్ తో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వీళ్లిద్దరినీ ఏసీబీ విచారించింది. ఈసారి వీళ్లలో కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.