Revanth Reddy: హామీల అమలు.. నిర్ణయాల్లో దూకుడు

ప్రజా సమస్యలపై పోరు, తనదైన పని తీరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన ఏడాది పాలనలో తెలంగాణపై తన ముద్ర వేశారు. పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానై నడిపిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో ఎదురే లేదనుకున్న గులాబి పార్టీని ఓడించారు. తెలంగాణ సమాజంలో తిరుగులేదనుకున్న కేసీఆర్‌ను గద్దెదించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ సీఎంగా రేవంత్ పగ్గాలు చేపట్టారు. పదేండ్ల అవినీతి, అక్రమాల బీఆర్‌ఎస్ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది. పాలనా వ్యవస్థ అచేతనంగా మారిన వేళ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. విద్య, వైద్యం, శాంతిభద్రతలు, పరిశ్రమలు, క్రీడారంగం, కృత్రిమ మేధ, పర్యాటకం.. ఇలా ప్రతిరంగంలో ప్రపంచస్థాయిలో తెలంగాణను నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సాగిన తెలంగాణ ఉద్యమ రణ నినాదాలను సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేదు. అందుకే, పేపర్ లీక్‌లతో అసమర్థతకు చిరునామాగా మారిన టీజీపీఎస్సీ ప్రక్షాళనకు నడుంబిగించారు. ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే టీజీపీఎస్సీపై సమీక్ష నిర్వహించడంతోపాటు ఢిల్లీ వెళ్లి స్వయంగా యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ అయ్యారు. నియామకాల ప్రక్రియ సక్రమంగా సాగాలంటే సమర్థులు, సచ్చీలురే బోర్డులో ఉండాలని దానిని ప్రక్షాళన చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాదిలో సీఎంగా రేవంత్ రాజకీయంగానే కాదు.. ప్రభుత్వాధినేత గానూ తన మార్క్ నిరూపించుకున్నారు. మంత్రివర్గ సహచరులు.. తన టీంతో కలిసి కొత్త విజయాలు నమోదు చేసారు. ఏడాది కాలంలో రేవంత్ సాధించిన విజయాలను తెలంగాణ సీఎంఓ అంశాల వారీగా వెల్లడించింది. దేశంలో ఏ రాష్ట్రంలో.. ఎప్పుడూ చేయని విధంగా .. ఆర్దిక కష్టాలు ఉన్నా ఒకే విడతలో రూ 2 లక్షల వరకు రుణ మాఫీ చేసి కొత్త రికార్డు నెలకొల్పారు. అదే విధంగా దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అతి తక్కువ సమయంలో అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కింది. మొదటి సంవత్సరంలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన,
పెట్టుబడుల్లో ప్రభుత్వం రికార్డుతోపాటు
మహిళా సంక్షేమ పథకాలు, కుల గణన, పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలు ఆయన పాలనలో చోటు చేసుకున్నాయి. మహిళా సంక్షేమం, రైతులు, హౌసింగ్, ఆర్థిక వృద్ధి, పట్టణాభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, కుల గణన వంటి అంశాలు కూడా ప్రముఖమైనవి. మహిళా సంక్షేమం కోసం ఉచిత బస్సు, ఉచిత డొమెస్టిక్ పవర్ (200 యూనిట్ల వరకు), రూ.500 వంట గ్యాస్ సిలిండర్ వంటి ప్రజాపథకాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
25 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ, రూ.21,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం, ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ఉన్న సన్న బియ్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్, రైతులకు 24/7 ఉచిత విద్యుత్ అందించడం, నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు వంటివి ఆయన పాలనలోసాధించిన విజయాలు.
ఒక్క ఏడాదిలో యువతకు 55,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను సృష్టించి రికార్డు సృష్టించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా యుద్ధం, స్కిల్స్ విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం వంటివి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రముఖమైనవి.
తొమ్మిది నెలల్లో రెట్టింపు ఎఫ్‌డీఐలు, 11 నెలల్లో మొత్తం పెట్టుబడులు కూడా 200 శాతానికి పైగా పెరిగేలా ఆయన చేపట్టిన చర్యలు, క్లైమేట్ క్రైసిస్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అర్బన్ రీఇమాజినేషన్ ప్రోగ్రామ్‌ను చేపట్టేందుకు దేశంలో హైదరాబాద్‌ను మొదటి నగరంగా మార్చేలా కృషి చేశారు. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, రేడియల్ రోడ్లు, మెట్రో రైల్ తదుపరి దశ.. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఈ ఏడాదిలో ఆయన చేపట్టిన నిర్ణయాల్లో ప్రముఖమైనవి.
నాయకత్వ సమర్థత
కాంగ్రెస్‌లో ప్రవేశించిన నాటి నుంచి సీఎం అయ్యే వరకూ రేవంత్ విశ్రమించలేదు. ముఖ్యమంత్రి అయిన తరువాత తన దైన ముద్ర కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్యుడికి మేలు చేయాలనే పార్టీ నాయకత్వం ఆదేశంతో నిర్ణయాలు అమలు చేసారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ తన నాయకత్వ సమర్దత నిరూపించారు. హైకమాండ్ అంచనాలు.. తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చే క్రమంలో రేవంత్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ, ఏడాది కాలం లోనే తెలంగాణలో కొత్త రికార్డులు నెలకొల్పారు. రేవంత్ పాలనలో సన్నాలు పండిరచిన రైతులకు బోనస్ అందిస్తున్నారు. 1947 నుంచి ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో ఆక్రమణలకు గురవుతూ వస్తున్న సరస్సుల పునరుద్దరణ మొదలైంది. 40 ఏళ్ల తరువాత ఆక్రమణలు నిలిచిపోయాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్నా నాటి పాలకు నిర్లక్ష్యంతో కలుషితమై .. నిరుపయోగంగా మారిన మూసీ నదిని 50 సంవత్సరాల తరువాత రేవంత్ పాలనలో కొత్త శోభ సంతరించుకుంటోంది. క్లైమేట్ క్రైసిస్ సవాళ్లను ఎదుర్కోవడానికి.. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అద్బుతమైన నగరంగా హైదరాబాద్ స్థిరమైన వృద్ధి సాధించేలా రేవంత్ పక్కా ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే తొలి సారిగా స్కిల్ యూనివర్సిటీని రేవంత్ ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయం రేవంత్ నాయకత్వంలో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గించేందుకు నగరంలోని అన్ని పెట్రోల్, డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి.. వాటి స్థానంలో 3,000 ప్లస్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నారు. అదే విధంగా నగరంలోని బాపూ ఘాట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు గోదావరి నుంచి తాగునీరు అందిస్తున్నారు. రాష్ట్రంలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన రెసిడెన్షియల్ పాఠశాల పిల్లలకు రేవంత్ ప్రభుత్వంలో ఆహారం కాస్మోటిక్ బడ్జెట్‌లు పెరిగాయి.
మహిళలకు రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అండగా నిలుస్తున్నారు. కోటి మంది మహిళా కోటీశ్వరులను సృష్టించేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలను..మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు రుణాలు అందిస్తున్నారు. రాష్ట్రలో సర్వే నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి అభ్యున్నతి దిశగా అడగులు వేస్తున్నారు. రెసిడెన్షియన్ పాఠశాలల నిర్వ హణ లో సంస్కరణలు ప్రవేశ పెట్టారు. దళిత, గిరిజన, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కొత్త క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అవినీతికి చిరునామాగా మారిన ధరణి పోర్టల్ సంస్కరణ బాధ్యతలు ఎన్‌ఐసీకి అప్పగించారు. ముఖ్యమంత్రి అంటే సేవకుడు మాత్రమే అనేలా.. గత పాలకులకు భిన్నంగా సామాన్యులు కలిసే అవకాశం కల్పించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సామాన్యులు వెళ్లే వెసులుబాటు కల్పించారు.
పేదవాడి ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల విలువైన యూనివర్సల్ హెల్త్‌కేర్ అమలవుతోంది. సామాన్యుల నుంచి వస్తున్న ప్రజా వాణి వినతుల్లో లో 5 లక్షల ప్రజా సమస్యల పరిష్కారం అయ్యాయి. ఇక, ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపు కొనసాగుతోంది. నిత్యం 18 గంటలు పని చేసే ముఖ్యమంత్రిగా రేవంత్ గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలను శ్రద్దగా వింటూ.. పాలనలో మెరుగుదల లక్ష్యంగా ప్రజాభిప్రాయసేకరణ చేస్తూ.. ప్రజా పాలన అందిస్తుండటంతో తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ భవిష్యత్ పైన నమ్మకం కలిగించటంలో సీఎం గా రేవంత్ తొలి ఏడాది సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
పెట్టుబడుల సాధన
సంక్షేమం.. అభివృద్ధి అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సర్కార్.. పెట్టుబడులపైనా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్, అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలతలు వివరించి దిగ్గజ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు సాధించారు. దావోస్ పర్యటనలో 40 వేల 232 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. ఇక అమెరికా, దక్షిణకొరియా పర్యటనలో దాదాపు 31 వేల 502 కోట్ల పెట్టుబడులు సాధించారు.
అంచనాలకు మించి
పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ.. పాలిటిక్స్‌లో అందరి అంచనాలకు మించి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చక్రం తిప్పుతున్నారు. సొంత పార్టీ నేతలతోపాటు ప్రతిపక్షాలను సింగిల్ హ్యాండ్‌తో కంట్రోల్ చేస్తున్నారు. కలహాలకు కేరాఫ్‌గా ఉండే కాంగ్రెస్‌లో సీనియర్లుగా ఉన్న సహచర మంత్రులుతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో మూడు నెలల కంటే ఎక్కువ కాలం సీఎం ఉండరనే ప్రచారాన్ని పటా పంచలు చేస్తూ జేజేలు కొట్టించుకున్నారు. ఏడాది పాలనలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంలో తనదైన మార్క్ పాలిటిక్స్‌ను నడుపుతున్నారు. బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలహీన పర్చేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు.