కరోనాపై పల్లేసీమల్లో ఎన్నారైల సేవలు… మంత్రి సింగిరెడ్డి

అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్), తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీఐటీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరులో ఏర్పాటు చేసిన కోవిడ్ దవాఖానాను తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్‍రెడ్డి ప్రారంభించారు. టి.కన్సల్ట్ ద్వారా మంత్రి తొలి అపాయింట్‍మెంట్ బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణుల కోసం వైద్యసేవల కోసం విదేశాల్లోని అమెరికాలోని ఎన్నారైలు మందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామస్తులు అమెరికాలో ఉన్న వైద్యులతో అనుసంధానమయ్యారు అని అన్నారు. ఉన్నత విద్యావంతులైన టెకీలు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల ఆధ్వర్యంలో పల్లెసీమల్లో సేవ చేసేందుకు ముందుకు రావడాన్ని అభినందించారు. ఎంపీ రాములు మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ ప్రాంతవాసుల ఆరోగ్యంపై శ్రద్ద చూపడం సంతోషకరమన్నారు. బల్మూర్‍లో కోవిడ్ దవాఖానా ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీటాను ఎమ్మెల్యే బాలరాజు అభినందించారు. ఏటీఎస్, టీఐటీఏ ఆధ్వర్యంలో నారాయణ్‍పేట్ జిల్లా మాగనూర్‍లో తొలి దవాఖాను గత నెలలో ప్రారంభించారు.