KCR: మౌనం ముప్పు తెస్తుంది కేసీఆర్…బయటకు రండి…!

టెక్నాలజీకి రాజకీయాలకు కాస్త దగ్గర సంబంధం ఉంటుంది. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినట్లు రాజకీయాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ ఒకే విధానాన్ని అనుసరించినా, అవలంబించినా లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడూ ప్రజల్లో ఉంటేనే వాటికి వెలుగు ఉంటుంది. రాజకీయ నాయకులు నిత్యం ప్రజల నోళ్ళలో నానుతూ ఉంటూనే వాళ్ళు చేసే రాజకీయానికి కాస్త ప్రాధాన్యత ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఈ విషయాన్ని గ్రహించడంలో విఫలం అవుతున్నారు.
గతంలో కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి… మళ్ళీ కొన్నాళ్ళు కనపడే కేసీఆర్… ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో తొలిసారి పార్టీ నిలబడినా… ఇప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో అసలు ఆయన… ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో ఎవరికి క్లారిటీ లేదు. కొన్నాళ్ళు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, మరికొన్నాళ్ళు ఆయన త్వరలోనే బయటకు వస్తారని… శాసనసభ సమావేశాలకు హాజరవుతారని ఎవరికీ నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేశారు. జాతీయస్థాయిలో దేశ్ కి నేత.. అంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని అప్డేట్ చేసి భారత రాష్ట్ర సమితిగా మార్చిన కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉండటం గులాబీ పార్టీని కలవరపెడుతోంది.
వాస్తవానికి ఆ పార్టీ ఇప్పుడు కష్టకాలంలోనే ఉంది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) దూకుడు… అలాగే భారతీయ జనతా పార్టీ తెరవెనుక వ్యూహాలు చూస్తుంటే… గులాబీ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనబడటం లేదు. ఏసీబీ కేసుని కేటీఆర్ తక్కువ అంచనా వేయడం ఆ పార్టీకి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టే సంకేతాలు కనపడుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్వయంగా ఎంటర్ కావడంతో కేటీఆర్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ చాలామంది కెసిఆర్ నుంచి ఎదురుచూస్తున్నది కేటీఆర్ (KTR) కు మద్దతు కావాలి అని.
గులాబీ పార్టీ నుంచి ఎంతమంది నేతలు ఎన్ని విధాలుగా బయటకు వచ్చి కేటీఆర్ పై పెట్టిన కేసులు తప్పుడు కేసులు అని ఆరోపణలు చేసిన స్వయంగా కేసీఆర్ వచ్చి మాట్లాడితే ఆ మాటలకు కాస్త వెయిట్ ఉంటుంది. మీడియా కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఆయన చేసే ప్రసంగాలకు జాతీయ మీడియా కూడా కాస్త హడావుడి చేస్తుంది/ కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది అనేది ఆ పార్టీ నేతల అలాగే కార్యకర్తల అభిమతం. గతంలో కవితను అరెస్టు చేసిన సమయంలో కూడా కేసీఆర్ అది ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేశారే గాని మీడియాలో దీనిపై ఘాటుగా వ్యాఖ్యలు చేయలేదు.
అప్పుడు కూడా మౌనమే ఎంచుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అది కలిసి వస్తుందని కూడా ఆయన భావించినా అది అంతగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేసే వరకు పరిస్థితి వచ్చినా… సరే కేసీఆర్ మాత్రం బయటికి వచ్చే ప్రయత్నం ఏ విధంగా కూడా చేయటం లేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేక బయటకు రావటం లేదు అనే అభిప్రాయమే ఎక్కువగా వినపడుతోంది. ఒకవేళ కెసిఆర్ బయటకు రాకపోతే మాత్రం ప్రస్తుత పరిస్థితులను తనకున్న అనుభవంతో కేటీఆర్ ఎదుర్కోవడం సాధ్యం కాదనే భావన చాలామందిలో వ్యక్తం అవుతుంది. ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే పార్టీని నడిపే బాధ్యత కేవలం హరీష్ రావు పైనే పడే అవకాశం ఉంది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఏకతాటి మీద ఉంటుందా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి కెసిఆర్ ఎంత త్వరగా బయటికి వస్తే అంత మంచిదనే భావన ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.