Phone Tapping: రేవంత్ రెడ్డికి షాక్..! ఫోన్ ట్యాపింగ్ విచారణలో సంచలన విషయాలు..!!

తెలంగాణలో (Telangana) ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్ టి.ప్రభాకర్ రావు (Prabhakar Rao) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. నాటి డీజీపీగా (DGP) ఉన్న ఎం.మహేందర్ రెడ్డి (Mahendar Reddy) ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నాయి. మహేందర్ రెడ్డి, BRS హయాంలో కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ఇబ్బంది పెట్టిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలోనూ ఆయన ప్రభావం కొనసాగడం, ఇప్పుడు ఈ కేసులో ఆయన పేరు బయటపడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చిలో మొదలైంది. SIB అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నాటి SIB చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ డి.ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు ఎన్.భుజంగ రావు, మేకల తిరుపతన్న, మాజీ డీసీపీ పి. రాధాకిషన్ రావు, ఓ టెలివిజన్ ఛానల్ యజమాని శ్రవణ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో 1,200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఈ ట్యాపింగ్ బాధితుల్లో ఉన్నారు. SIBలోని స్పెషల్ ఆపరేషన్ టీం (SOT) ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు నేతృత్వంలోని ఈ బృందం, 17 కంప్యూటర్లు, ప్రత్యేక సర్వర్లను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థుల ప్రొఫైల్స్ తయారు చేయడం, వారి కదలికలను గమనించడం, ఆర్థిక వనరులను ట్రాక్ చేయడం వంటివి ఈ ఆపరేషన్ లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చాయి.
ప్రభాకర్ రావు, 2023 డిసెంబర్‌లో BRS ఓటమి తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. 15 నెలల తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి SIT ముందు హాజరయ్యారు. మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. మహేందర్ రెడ్డి, BRS హయాంలో డీజీపీగా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్‌గా కీలక పదవులు నిర్వహించారు. ఆయన పేరు ఈ కేసులో తెరపైకి రావడం రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది.
మహేందర్ రెడ్డి BRS హయాంలో డీజీపీ పనిచేశారు. ఆ సమయంలో కీలక రాజకీయ నిర్ణయాల్లో ఆయన జోక్యం చేసుకున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డిని, ఇతర కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేయడంలో ఆయన ఆదేశాలు కీలకంగా ఉన్నాయని ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రభుత్వంలోనూ మహేందర్ రెడ్డి ప్రభావం కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలు నిజమైతే, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్రపై కొత్త కోణంలో చర్చ జరిగే అవకాశం ఉంది.