రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. సూర్యకిరణ్ విమానాల ఎయిర్ షో..

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాభయ్యాయి. ముఖ్యంగా విద్యుత్ కాంతుల వెలుగు జిలుగులతో తళుకులీనుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజైన 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయ ప్రాంగణంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్.. పలువురు నేతలు, వీఐపీలు, ప్రముఖులను ఆహ్వానించారు.
శనివారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలకు ఆహ్వానపత్రిక అందించారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రొటోకాల్ విభాగం సంచాలకుడు వెంకట్‌రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌లతో కలిసి మంత్రి పొన్నం ఉదయం తొలుత రాజ్‌భవన్‌కు వెళ్లారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన, ఆవిష్కరణ కార్యక్రమం గురించి గవర్నర్‌కు వివరించి, ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం దిల్‌కుశ అతిథిగృహానికి వెళ్లి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. తర్వాత ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లారు. మంత్రిని కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి, శాలువాతో సత్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన వేడుకలకు రావాలని కేసీఆర్‌కు పొన్నం ఆహ్వానపత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తదితరులు కేసీఆర్‌తో కలిసి భోజనం చేశారు. రాజకీయాలేవీ చర్చించలేదు: పొన్నం కేసీఆర్‌తో భేటీ తర్వాత పొన్నం ఎర్రవల్లిలో విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘ప్రభుత్వం పక్షాన తెలంగాణలో అందరినీ గౌరవిస్తాం. గవర్నర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లను కలిసి ఆహ్వానించాం. ఈ భేటీలో రాజకీయ అంశాలేవీ మాట్లాడుకోలేదు. విగ్రహం రూపంపై ఎలాంటి చర్చ జరగలేదు. విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రతిపక్ష పార్టీగా వారి అభిప్రాయాలు వారికుంటాయి. ఇప్పుడు జరిగింది మర్యాదపూర్వక భేటీ మాత్రమే. మధ్యాహ్న సమయం కావడంతో కేసీఆర్ ఆహ్వానం మేరకు భోజనం చేశాం. మేం అందరినీ ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ రాక విషయమై వారి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆయన శాసనసభకు వస్తారా? రారా అనేది వారి వ్యక్తిగత విషయం’ అని పొన్నం తెలిపారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించే ఎయిర్ షోకు భారీ సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. తొమ్మిది ‘సూర్యకిరణ్’ విమానాలు ఎయిర్ షోలో పాల్గొంటాయని తెలిపారు. అనంతరం రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ షోకు హాజరయ్యే వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు.