Revanth Reddy :రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కల : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు. హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం (CII National Council Meeting) నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీ (RTC)లోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించాం. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ను అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నాం. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది. నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. రాష్ట్రానికి తీరప్రాంతం లేదు. అందుకే డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నాం. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కంపెనీలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని తెలిపారు.