Jagan – Revanth: జగన్ బాటలో రేవంత్ రెడ్డి..!?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ (Cinema Industry) వ్యవహారం పెద్ద హాట్ ఇష్యూగా మారిపోయింది. ఇండస్ట్రీలో పలు పరిణామాలు జరుగుతున్నా అందరి చూపూ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టుపైనే ఉంది. ఎందుకు అరెస్టు చేశారు.. ఇకపై ఏం జరుగుతుంది.. బెనెఫిట్ షోలు రద్దు చేస్తే నష్టమేంటి.. టికెట్ రేట్లు పెంచకపోతే ఏమవుతుంది.. లాంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వెతుక్కుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీసుకుంటున్న నిర్ణయాలు సినీ ఇండస్ట్రీకి భారీ నష్టాన్ని కలిగిస్తాయని చెప్పుకుంటున్నారు. నాడు ఏపీలో వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఇదే తరహా విధానాలతో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టిన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు.
2019 నుంచి 2024 వరకూ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన సినిమా ఇండస్ట్రీ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. బెనిఫిట్ షోలను, అదనపు షోలను అనుమతించలేదు. పైగా టికెట్లను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుంది. సినిమా పెద్దలను తన ఇంటికి పిలిపించుకుని అవమానించారనే ఆరోపణలున్నాయి. జగన్ కు సినిమా ఇండస్ట్రీపై అంత సానుకూలత లేదు. ఇండస్ట్రీ తనకు ఎప్పుడూ సహకరించదనే ఫీలింగులో ఉండేవారు. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం జగన్ ను శత్రువుగానే చూసింది. వైసీపీకీ (YSRCP), ఇండస్ట్రీకి మధ్య ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది.
ఇప్పుడు తెలంగాణలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇండస్ట్రీ అడిగినవన్నీ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చంది. ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. ఎక్కడ ఎలాంటి ఈవెంట్లు చేసుకోవాలన్నా అడగ్గానే అన్నింటికీ ఓకే చెప్తోంది. అయితే నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ ను కూల్చివేసిన తర్వాత సినీ ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డి తీరుపై మార్పు వచ్చింది. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయనకు వ్యతిరేకంగా మారింది. జైలు నుంచి అల్లు అర్జున్ రాగానే ఇండస్ట్రీ ప్రముఖులంతా వెళ్లి పరామర్శించడం, విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం.. లాంటివి రేవంత్ సర్కార్ కు ఆగ్రహాన్ని తెప్పించాయి.
రేవంత్ తప్పు చేస్తున్నారనే భావనను క్రియేట్ చేయడంలో సినీ ఇండస్ట్రీ సక్సెస్ అయింది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. ఒకవైపు సినీ ఇండస్ట్రీకి అడిగినవన్నీ చేస్తున్నా కూడా తమదే తప్పు అని ప్రచారం చేయడాన్ని ఆయన సహించలేకపోయారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం తప్పా.. అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవడం నేరమా అనే ఫీలింగులో రేవంత్ ఉన్నారు. సినిమా వాళ్లు వ్యాపారం చేసుకుంటున్నారు కానీ ప్రజాసేవ కాదని స్పష్టం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే నాడు జగన్ కూడా ఇదే ధోరణి ప్రదర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే స్టైల్ లో పని చేస్తున్నట్టు అర్థమవుతోంది.