Local Body Elections: లోకల్ బాడీ ఎలక్షన్స్ పై రేవంత్ వ్యూహం ఫలించేనా..?

తెలంగాణ (Telangana) లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గడువు ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. వీటికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆలస్యం చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా ఆగిపోతాయని భయపడుతోంది. అయితే ఈ ఎన్నికలను విపక్షాలు రెఫరెండంగా బావించే అవకాశం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ స్వీప్ (clean sweep) చేయాలనే లక్ష్యంతో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఇప్పటికే మెజారిటీ హామీలను నెరవేర్చామని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చెప్తోంది. సంక్రాంతికి రైతు భరోసా (Rythu bharosa) నిధులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ (BRS) చేసిన అప్పులను కూడా తగ్గించుకుంటున్నామని చెప్తోంది. మరోవైపు కులగణన ద్వారా తేనెతుట్టెను కదిపింది. ఇది పూర్తవగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లానుకుంటోంది రేవంత్ రెడ్డి సర్కార్. తద్వారా బీసీల ఓట్లను ఆకట్టుకోవాలనేది ఆయన ఆలోచన.
కులగణనకు బీఆర్ఎస్, బీజేపీ (BJP) లాంటి పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కులగణన (castewise census) జరగాలని.. దాని మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపట్టింది. హైకమాండ్ అప్పగించిన బాధ్యతలను రేవంత్ రెడ్డి ముందు స్వీకరించి కులగణన చేపట్టారు. ఇప్పటికే దాదాపు 80శాతం కులగణన పూర్తయింది. ఈ నెలాఖరులోపు దీన్ని పూర్తి చేసి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటోంది. అదే సమయంలో గత ప్రభుత్వాలు బీసీలకు చేసిన అన్యాయాన్ని చెప్పాలనుకుంటోంది. అప్పుడు బీసీలపై విపక్షాల నోళ్లు మూయించవచ్చనుకుంటోంది.
బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలియగానే బీఆర్ఎస్ కూడా ఆ పాట పాడుతోంది. కవిత (MLC Kavitha) ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహించింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. ఇది కాంగ్రెస్ తన అస్త్రంగా మార్చుకుంటోంది. అదికారంలో ఉన్నప్పుడు బీసీలను ఏమాత్రం పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు బీసీలపై అతి ప్రేమ చూపిస్తోందని విమర్శిస్తోంది. ఆ పార్టీలో బీసీలకు స్థానం లేదని.. కవిత బీసీలకు ప్రతినిధా అని ప్రశ్నిస్తోంది.
రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై మిశ్రమ స్పందన ఉంది. కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉంది. దాని నుంచి బయటపడాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మంత్రులను జిల్లాలకు బాధ్యులను చేసి కేడర్ తో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది. తద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. అదే సమయంలో అసంతృప్తులను తమవైపు తిప్పుకోవాలనుకుంటోంది. అంతేకాక గ్రామ, మండలస్థాయిలోని సమస్యలను గుర్తించి ఎన్నికలలోపు వాటిని పూర్తి చేయాలనుకుంటోంది. అప్పుడు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయొచ్చనేది ఆ పార్టీ ఆలోచన.