AP Politics: జగన్–చంద్రబాబు–పవన్–లోకేశ్ ప్రయాణాలపై ఆరోపణలు, ప్రతిఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార–విపక్ష నేతల వారాంత పర్యటనలు ఇప్పుడు రాజకీయ వాదోపవాదాలకు కేంద్రంగా మారాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) రాష్ట్రం బయట ఎక్కువ రోజులు గడుపుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. సీఎం పదవి కోల్పోయిన తర్వాత గత 18 నెలల్లో జగన్ రాష్ట్రంలో గడిపిన రోజులు పది దాటలేదని అనిత ఆరోపించడం రాజకీయాల్లో కొత్త హీట్‌ను తీసుకొచ్చింది. పులివెందుల ఎమ్మెల్యే (Pulivendula MLA) అయిన జగన్ ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారో ముందుగా చెప్పాలని ఆమె సవాలు విసిరింది.
ఇక మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తరచు హైదరాబాద్ (Hyderabad)కు వెళ్లడాన్ని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. ఈ ముగ్గురు నేతల పర్యటనలు, ప్రయివేట్ విమాన ప్రయాణాలు ప్రజాధనంపై భారమవుతున్నాయంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. లోకేశ్ 18 నెలల్లో 70కి పైగా విమాన ప్రయాణాలు చేశారని, ప్రతి వారం కోట్లలో ఖర్చులు వస్తున్నాయని ఆరోపిస్తోంది. అదే సమయంలో వీరు ప్రజా ధనాన్ని ఉపయోగించడం లేదని చెప్పినా, ప్రయాణ ఖర్చులు ఎవరు భరిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
దీనికి ప్రతిగా టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రూ.200 కోట్లకు పైగా విమాన ప్రయాణాలకు ఖర్చు చేశారని ఆరోపిస్తూ, ఇప్పుడు వారిపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని చెబుతోంది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru)కు జగన్ తరచుగా వెళ్తున్నారనే విషయాన్ని టీడీపీ పదేపదే ప్రస్తావిస్తోంది. ప్రతి వారం శుక్రవారం బెంగళూరు వెళ్లి మంగళవారం తిరిగి వస్తుంటారని, రెండు రోజులు రాష్ట్రంలో గడిపి మళ్లీ బయలుదేరుతున్నారని విమర్శిస్తుంది.
ఇలా నలుగురు పెద్ద నేతలు—జగన్ బెంగళూరుకు, చంద్రబాబు–పవన్–లోకేశ్ హైదరాబాద్‌కు వెళ్లే వ్యవహారం—ప్రజల్లో కూడా ఆసక్తికర చర్చకు కారణమైంది. ముఖ్యమంత్రి ఉండవిల్లి (Undavalli)లో అధికారిక నివాసం ఉన్నప్పటికీ వారాంతాల్లో హైదరాబాద్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని వైసీపీ ఆక్షేపిస్తోంది. ఇక పవన్, లోకేశ్ కూడా వారాంతాల్లో తెలంగాణకు వెళ్లడాన్ని ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో జగన్ కర్ణాటక పర్యటనలను టీడీపీ ఎక్కువగా ఎత్తిచూపుతోంది. మొత్తానికి ఏపీలో ముఖ్యమైన నాయకులు ఎవరు కూడా వారాంతరాలలో తమ సొంత నియోజకవర్గాలలో ఉండడం లేదు అన్న విషయం స్పష్టం అవుతుంది. మిగిలిన ఏ రాష్ట్రాల్లో కూడా నేతలకు ఇటువంటి పరిస్థితి లేదు. మరి ఏపీలో మాత్రమే ఎందుకు అన్న విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి..






