Revanth – KCR : రేవంత్ రెడ్డి సవాల్‌ను కేసీఆర్ ఈసారైనా స్వీకరిస్తారా..!?

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ముందుంటోంది. తమకు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ బీఆర్ఎస్ వదులుకోవట్లేదు. అయితే ఇందుకు ధీటుగా బదులిస్తోంది కాంగ్రెస్ (Congress) పార్టీ. తగ్గేదే లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపుతున్నారు. అంతేకాదు.. అసెంబ్లీలో ఈ అంశాలపై చర్చకు కూడా సిద్ధమంటున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) ను అసెంబ్లీకి రావాలని పదేపదే కోరుతున్నారు. మరి ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (Assembly Sessions) ఈ నెల 9 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడో తేదికి ఏడాది పూర్తవుతోంది. ఏడాది సంబరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల పేరిట పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇదే ఊపుతో అసెంబ్లీలో కూడా తమ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమవుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రతిపక్ష బీఆర్ఎస్ అడుగుతున్న అన్ని ప్రశ్నలకు అసెంబ్లీలోనే సమాధానం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ తీరును అసెంబ్లలోనే ఎండగట్టాలని వ్యూహరచన చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేరోజు అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆయన కాసేపు ఉండి వెళ్లిపోయారు. అసెంబ్లీలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత బడ్జెట్ పై జరిగిన చర్చకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) లాంటి వాళ్లు మాత్రమే అసెంబ్లీకి హాజరవుతున్నారు. అధికారపక్షాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం సీఎం కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావు పిల్లలని.. వాళ్లతో తేల్చుకునే వ్యవహారం కాదని చాలా లైట్ తీసుకుంటున్నారు. అందుకే కేసీఆర్ ను ఒక్కసారైనా సభకు పిలిపించాలని బీఆర్ఎస్ నేతలకు సూచిస్తున్నారు.
కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై బీఆర్ఎస్ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ పై తాము తొందరపడి విమర్శలు చేయబోమని, ఏడాది సమయం ఇచ్చిన తర్వాత స్పందిస్తామని అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఏడాది పూర్తయింది. మరి కేసీఆర్ స్పందిస్తారా.. లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో కేసీఆర్ ఎవర్నీ పెద్దగా కలవలేదు. అయితే ఇటీవలికాలంలో ఫాంహౌస్ (KCR Farm House) లో పలువురు నేతలను కలుస్తున్నారు. వాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాస్త యాక్టివ్ అయ్యారు. మరి రేవంత్ సవాల్ ను స్వీకరించి కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా.. లేకుంటే ముందులాగే ఫాంహౌస్ కే పరిమితమవుతారా.. అనేది వేచి చూడాలి.