IndiGo: ఇండిగో గందరగోళం…విమానాలు రద్దు
పైలట్ల కొరత కారణంగా ఇండిగో (IndiGo) సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజుల నుంచి భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతూ వస్తున్నాయి. ఆఖరి నిమిషంలో కూడా సర్వీసులు రద్దు అవుతుండటంతో ప్రయాణీకులు నానా ఇక్కట్లు పడుతున్నారు. కోల్‌కతాలోని ఎన్ఎస్సీ బోస్ విమానాశ్రయంలో ఇండిగో 41 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో 21 వివిధ గమ్యస్థానాల నుంచి ఇన్‌బౌండ్ సర్వీసులు, 20 షెడ్యూల్ డిపార్చర్ సర్వీసులున్నాయి. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 35 ఇండిగో విమానాలను రద్దు చేశారు. వడోదర విమానాశ్రయంలో మూడు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. రాజ్‌కోట్ విమానాశ్రయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ముంబైకి వెళ్లే ఒక ఇండిగో విమానం మాత్రమే రద్దు అయింది.






